
ఇద్దరిని బలిగొన్న ఈత సరదా
రాజేంద్రనగర్: జలపాతంలో ఈతకొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్ ఎం.ఎం.పహాడీకి చెందిన మహ్మద్ రెహాన్ (16), సోహేల్ (15)లతో పాటు మరో నలుగురు బైక్‌లపై ఆదివారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్ ప్రాంతంలోని మొండికత్వ ప్రాంతానికి చేరుకున్నారు. జనచైతన్య వెంచర్‌లోని ఖాళీ స్థలంలో వాహనాలను పార్కు చేసి జలపాతం వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు మహ్మద్ రెహాన్, సోహేల్‌లు నీళ్లలో మునిగిపోయారు. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు తెలపడంతో అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 8 గంటల వరకు వెతికి ఇద్దరి మృతదేహాలు నీటిలోంచి వెలికితీశారు. ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇద్దరిని బలిగొన్న ఈత సరదా