
ఆధ్యాత్మికం.. అదృష్టం
రాష్ట్ర స్థాయి బహుమతి
శ్రీవారి సేవలో రుద్రారం భజన మండలి
● ఏటా అఖండ హరినామ సంకీర్తనలో పాల్గొంటున్న సభ్యులు
● వృత్తి పనులు చేసుకుంటూనే సంగీతంలో ప్రావీణ్యం
‘ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా ఉన్నాము. వృత్తిపరమైన పనులు చేసుకుంటూనే.. టీటీడీ ఆహ్వానం మేరకు ఏటా ఏడుకొండలు సన్నిధిలో జరిగేఅఖండ హరినామ సంకీర్తనలోపాల్గొంటున్నాం. శ్రీవారి సేవలో తరిస్తున్నాము. దీనిని తమ అదృష్టంగా భావిస్తున్నాము’ అని రుద్రారం వీరాంజనేయభజన మండలి సభ్యులు అన్నారు.
కొడంగల్ రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో నిర్వహించే అఖండ హరినామ సంకీర్తనలో కొడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన వీరాంజనేయ భజన మండలి సభ్యులు పాల్గొంటున్నారు. వీరు గ్రామంలోని పురాతన వీరాంజనేయ ఆలయంలో ప్రతి శనివారం, పండుగ, ప్రత్యేక రోజుల్లో భజనలు చేయడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
14 ఏళ్ల ప్రస్థానం
ఆధ్యాత్మిక కార్యక్రమాల నేపథ్యంలో మహబూబ్‌నగర్ దేవాదాయ శాఖ కార్యాలయం సూచన మేరకు భజన మండలి సభ్యులు.. 2012లో తిరుమలలో నిర్వహించే అఖండ హరినామ సంకీర్తనలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం టీటీడీ నుంచి ఆహ్వానం అందింది. అదే ఏడు అక్టోబర్ 10న 18మంది సభ్యులు తొలిసారి అఖండ పారాయణంలో పాల్గొన్నారు. అలా మొదలైన వీరి ప్రస్థానం 14 ఏళ్లుగా కొనసాగుతోంది. గత నెల సెప్టెంబర్ 11,12 తేదీల్లో ఉదయం 8నుంచి 10గంటలు, రాత్రి 8నుంచి 10గంటల వరకు, రెండు రోజులు 8 గంటల పాటు పారాయణంలో పాల్గొన్నారు.
2021– 22లో రవీంద్రభారతిలో ‘భక్తి భజనసంకీర్తన పరిషత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి భజన పోటీల్లో 4వ స్థానం బహుమతిని భజన మండలి అందుకుంది. మండలిలో 18 మంది సభ్యులు ఉండగా.. ఇందులో 13 మంది వ్యవసాయం చేస్తూనే.. సంగీతంలో ప్రావీణ్యం పొందారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇద్దరు వైద్యులు, మరో ఇద్దరు వ్యాపారులు, ఒకరు రాజకీయ నేత ఉన్నారు. ఇటీవల శ్రీశైలంలో అఖండ శివనామ స్మరణలో సభ్యులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం.. అదృష్టం