
విద్యాలయాల తరలింపు!
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌కు మంజూరు అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను మరో ప్రాంతానికి తరలిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే విషయమై ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశాయి. శనివారం సీఎంను కలవడానికి వెళ్లిన ఉపధ్యాయులకు అపాయిట్‌మెంట్ దొరకలేదు. దీంతో వారు నిరాశగా వెనుదిరిగారు. కాగా.. కళాశాల, గురుకుల భవనాలు నిర్మిస్తున్న ప్రాంతాన్ని ‘సాక్షి’ ఆదివారం విజిట్ చేసింది. నిర్మాణ పనుల గురించి సిబ్బందితో మాట్లాడగా.. రెండు నెలల నుంచి పనులు నిలిపివేశారని తెలిపారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ‘కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ’ని ఏర్పాటు చేసి ఉద్యమ బాట పట్టారు.ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు వాస్తవాలను దాచిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్
పాత కొడంగల్ సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకుంది.అందుకు 20 ఎకరాల్లో అధునాతనమైన భవనాలను నిర్మించడానికి భూమి పూజ చేసింది. ఇందుకు రూ.100 కోట్లను సైతం మంజూరు చేసింది.
మెడికల్ కళాశాల
మండల పరిధి అప్పాయిపల్లి(ఎరన్‌పల్లి) గ్రామ శివారులో మెడికల్ కళాశాల నిర్మించడానికి ప్రభుత్వం రైతుల భూమి సేకరించింది. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం రూ.124.50 కోట్లు మంజూరు చేసింది. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం, సౌకర్యాల కల్పనకు రూ.46 కోట్లు, ప్రభుత్వ ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాలల నిర్మాణానికి రూ.27 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులు చేపట్టడానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి.
అభివృద్ధి పనులను తరలించ వద్దు
మండలానికి మంజూరు అయిన విద్యా సంస్థలను తరలించవద్దని ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మెడికల్ కళాశాల, గురుకులాలను లగచర్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. అలా చేయడం వలన ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందని వాపోయారు. అనంతరం కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా లక్ష్మీనారాయణ గుప్తా, కో–కన్వీనర్లుగా సురేష్ కుమార్, శ్రీనివాస్, శాంతకుమార్, గౌసన్, నవాజ్, రమేష్‌బాబులనునియమించారు.
ఆగిన ఇంటిగ్రేటెడ్, మెడికల్ కళాశాల నిర్మాణ పనులు
ఆందోళన బాటలో ఐక్య కార్యాచరణ కమిటీ
కడా అధికారిని కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
అయోమయంలో కొడంగల్ ప్రజలు