
పరిగికి పవర్ సమస్య లేకుండా చేస్తా
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
● 400 కేవి సబ్‌స్టేషన్ మంజూరు
పరిగి: పరిగికి విద్యుత్ సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పరిగికి కొత్తగా 400కేవీ సబ్‌స్టేషన్ మంజూరు అయిందని, త్వరలో శంకుస్థాపన చేస్తానని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 400కేవీల సబ్‌స్టేషన్ మంజూరు అయితే.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎలాంటి పనులు చేపట్టలేదని ఆరోపించారు. మళ్లీ కాంగ్రెస్ వచ్చాకే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి, పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. రూ.400 కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణం జరుగుతుందని, జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ సబ్‌స్టేషన్ ఏర్పాటు అవుతుందన్నారు. పరిగిలో ఇప్పటికే 220 కేవీ సబ్‌స్టేషన్, విండ్‌పవర్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తోందని తెలిపారు. అధికారం చేపట్టిన ఏడాదిలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసిందని, రైతులకు రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం అందిస్తోందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ పాల్గొన్నారు.