
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
మర్పల్లి: చేతబడి చేసిందని వేధించడంతో ఓ మహిళ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మర్పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మందమీది లక్ష్మి (26) వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె చనిపోకముందు పక్షం రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో లక్ష్మి ఇంటి ముందు దొబ్బల నర్సమ్మ అటు ఇటు తిరుగుతూ కనిపించింది. ఇది గమనించిన లక్ష్మి భర్త నర్సింలు, కుటుంబ సభ్యులు ఇంత రాత్రి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. దీంతో ఇల్లు శుభ్రం చేసుకొనేందుకు పశువుల పేడ కోసం వచ్చినట్లు బదులిచ్చింది. అప్పటికే అస్వస్థతకు గురైన లక్ష్మి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో మృతి చెందింది. తన భార్య మృతికి నర్సమ్మే కారణమని, చేతబడి చేయడంతోనే చనిపోయిందని నర్సింలు, కుటుంబసభ్యులు ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆమెను వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపానికి గురైన నర్సమ్మ గ్రామంలోని చెన్నారెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి కుటుంబసభ్యులు వేధించడంతో నర్సమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు కంట తడి పెట్టారు. మృతురాలి కుమారుడు దుబ్బల శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ, మోమిన్‌పేట సీఐ వివరాలు ఆరా తీశారు.