
అప్పుల ఊబిలో జీపీలు
రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న మాజీ సర్పంచులు కార్యదర్శులపై నిర్వహణ భారం చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్న ప్రత్యేక అధికారులు పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఇబ్బందుల్లో ప్రజలు
చెల్లించాల్సిన బిల్లులు రూ.29 కోట్లు
వికారాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికలు ఆలస్యం కావడంతో గ్రామ పంచాయతీలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. పదవిలో ఉన్నప్పుడు చేసిన పనులకు బిల్లులు అందక మాజీ సర్పంచులు అవస్థలు పడుతున్నారు. రెండున్నరేళ్లుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగక వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం జీపీల నిర్వహణ కార్యదర్శులపై పడింది. వీరు సైతం అప్పులు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్థానిక సందడి మొదలవడంతో బిల్లులు మంజూరవుతాయని అందరూ ఆశించారు. కానీ వాయిదా పడటంతో నిరాశకు లోనయ్యారు. జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో రూ.29 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందా అని గత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.750 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండగా రెండు నెలల క్రితం రూ.150 కోట్లు విడుదల చేసింది. అయితే జిల్లాకు చిల్లిగవ్వ కూడా రాకపోవడం నిరాశ పరిచింది.
బీఆర్‌ఎస్ హయాం నుంచే..
గత ప్రభుత్వ హయాంలో అప్పటి సర్పంచులు సొంత డబ్బు వెచ్చింది అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ బిల్లులు మంజూరు కాలేదు. అప్పట్లో ఏడాదిన్న పాటు ఎదురు చూశారు. ఆ తర్వాత వారి పదవీ కాలం ముగిసింది. మరో ఏడాదైనా బిల్లులకు మోక్షం లభించలేదు. సర్పంచుల స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించినా వారు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా సరిగ్గా లేదని ప్రజలు పేర్కొన్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో కనీస అవసరాల కోసం ప్రతి నెలా రూ.లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది. చిన్న జీపీల్లో సైతం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సర్పంచులు పదవిలో ఉన్న సమయంలో సొంత డబ్బు లేదా అప్పు చేసి ఖర్చు చేసేవారు. వారి పదవీ కాలం ముగిసిన నాటి నుంచి ఆ భారం పంచాయతీ కార్యదర్శులపై పడింది. మిత్తికి డబ్బు తెచ్చి సమస్యలు పరిష్కరించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు సార్లు కార్యదర్శులు మాకు ఈ బాధ్యతలు వద్దంటూ ఎంపీడీఓలకు పంచాయతీల తాళాలు అప్పగించగా.. వారిని సముదాయించి బాధ్యతలు అప్పగిస్తున్నారు.
పన్నులు ఖర్చు చేయలేని స్థితిలో..
గతంలో పన్నుల రూపంలో వచ్చే డబ్బును పంచాయతీలు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉండేది. 2018లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. వసూలు చేసిన పన్నులు ట్రెజరీలో జమ చేయాలనే నిబంధన విఽధించారు. తిరిగి ప్రభుత్వ అనుమతితో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ట్రెజరీ ఖాతాలను ఎక్కువ శాతం ఫ్రీజింగ్‌లో ఉంచుతోంది. దీంతో పంచాయతీలు ఆ డబ్బు ఖర్చు చేసుకునే వీలులేకుండా పోయింది. పాలక మండళ్లు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి జీపీలకు రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. దీంతో పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
పెండింగ్‌లో స్కూల్ బిల్లులు
నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 1,130 పాఠశాలలు ఉండగా 371 స్కూళ్లను ఈ పథకం కింద ఎంపిక చేశారు. వాటిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. 62 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా రూ.24.4 కోట్లు చెల్లించారు. మరో రూ.10.35 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులు సైతం అప్పట్లో సర్పంచులు, వార్డు సభ్యులు చేశారు. పనులు పూర్తయ్యి మూడేళ్లు దాటినా బిల్లులు రాలేదని వారు తెలిపారు.