
మద్యం మత్తులో డ్రైవర్ హల్‌చల్
రెండు బైకులు, దుకాణం, సామగ్రి ధ్వంసం
తాండూరు రూరల్: మద్యం మత్తులో ఓ డ్రైవర్ ట్రాక్టర్ నడపడంతో బీభత్సం సృష్టించాడు. రెండు బైక్‌లు, సామగ్రి, కార్పెంటర్ షాపు షెటర్‌ను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గౌతపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. మల్కాపూర్ శివారులోని నాపరాతి గనుల నుంచి డ్రైవర్ పవార్ లక్ష్మణ్ మద్యం తాగి ట్రాక్టర్‌లో నాపరాతి లోడ్‌తో తాండూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో గౌతపూర్‌లో కొత్త అశోక్ దుకాణ సముదాయం వద్ద ఓ కార్పెంటర్ షాపులోకి దూసుకెళ్లాడు. అంతకు ముందు రెండు బైకులను ఢీకొట్టాడు. పక్కనే ఉన్న దుకాణం ముందు ఉన్న విలువైన సామగ్రిని ధ్వంసం చేశాడు. ట్రాక్టర్ ముందు టైర్ సైతం ఊడిపోయింది. వెంటనే స్థానికులు డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తు, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు డ్రైవర్ పవార్ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.