
క్రాప్ సర్వేతో మేలు
కొత్తూరు: రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సమగ్రంగా తెలుసుకుని వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది. ఆ వివరాలను శాటిలైట్‌కు అను సంధానం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మండలంలో సర్వే తుది అంకానికి చేరుకుంది. మండలంలో సాగుకు యోగ్యమైన భూమి 8,900 ఎకరాలు ఉండగా ఈ ఏడాది 8,800 ఎకరాల్లో రైతులు ఆయా రకాల పంటలను సాగు చేశారు. కాగా ఇప్పటికే వ్యవసాయ అధికారులు 8,200 ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మిగిలిన 600 ఎకరాల్లో సాగు చేసిన వివరాలను త్వరలో పూర్తి చేయనున్నారు.
సర్వేతో ప్రయోజనాలు
● కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలకు ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుని రైతులకు న్యాయం చేస్తారు.
● క్రాప్ సర్వేతో రైతులు ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు సాగు చేశారో? అన్ని వివరాలు సమగ్రంగా అధికారుల వద్ద ఉంటాయి.
● పంట దిగుబడి సమయంలో రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా మార్కెట్‌లో తమ పంటలను విక్రయించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.
● సర్వేను ప్రామాణికంగా తీసుకుని భవిష్యత్తులో రైతులకు అవసరమైన ఎరువులు, ఇతర అవసరాలను తీర్చడానికి సర్వే అంశాలు చాలా వరకు ఉపయోగపడతాయి.
● ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నప్పడు రైతులకు త్వరగా పరిహారం అందించడంలో సర్వే వివరాలు దోహదపడతాయి.
● క్రాప్ సర్వే ఆధారంగా రైతులు నష్టపోయే పంటలను సాగు చేయకుండా చూడవచ్చు.
● అదే సమయంలో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి వాటిని సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహించవచ్చు.
● మండలంలోని క్లస్టర్ల వారీగా ఏఈవోలు తమకు కేటాయించిన గ్రామాల్లో మొబైల్ యాప్‌తో పంటలను సర్వే చేయాలి. అనంతరం సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
వైపరీత్యాల సమయంలో త్వరగా పరిహారం
పంటలు లాభాలకు అమ్ముకునే వెసులుబాటు
నమోదు చేసుకోవాలని అధికారుల సూచన
నమోదు చేశాం
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన క్రాప్ సర్వే మండలంలో దాదాపు పూర్తయింది. 8,800 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఇప్పటివరకు 8,200 ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. క్రాప్ సర్వేతో రైతులకు బహుళ ప్రయోజనాలన్నాయి.
– గోపాల్‌నాయక్, ఏఓ, కొత్తూరు

క్రాప్ సర్వేతో మేలు