
ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయి!
● డీసీసీ అభిప్రాయ సేకరణ సమావేశానికి కాలె యాదయ్య
● అబ్జర్వర్లను కలిసి వెళ్లిపోయిన వైనం
చేవెళ్ల: డీసీసీ అధ్యక్ష ఎన్నికపై సోమవారం చేవెళ్లలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధిష్టానం పంపించిన పార్టీ అబ్జర్వర్లు హాజరయ్యారు. మీటింగ్ మధ్యలో అక్కడికి చేరుకున్న లోకల్ ఎమ్మెల్యే యాదయ్య వచ్చిన అతిథులకు నమస్కరించి, కరచాలనం చేసి వెళ్లిపోయారు. పార్టీ ఫిరాయింపుల కేసు నేపథ్యంలోనే ఆయన మీటింగ్‌లో కూర్చోలేదని అక్కడున్న నేతలు గుసగుసలాడారు. ఇదిలా ఉండగా.. తాను పార్టీ మారలేదని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ మీటింగ్‌కు ఎందుకు వచ్చారో ఆయనకే తెలియాలని భీంభరత్ వర్గం అసహనం వ్యక్తం చేయగా, తన వర్గానికి నేనున్నానని సంకేతాన్నిచ్చేందుకే యాదయ్య ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని కాంగ్రెస్‌లో చర్చసాగింది.