
ఆగని మట్టి దందా!
● ఇష్టానుసారంగా తవ్వకాలు
● రాత్రి సమయంలో గుట్టలను
తోడేస్తున్న అక్రమార్కులు
● పట్టించుకోని అధికారులు
పరిగి: సహజ సంపద తరిగిపోతుంది. అనుమతుల్లేకుండా కొండలు, గుట్టలను అక్రమార్కులు రాత్రికి రాత్రే తవ్వేస్తున్నారు. మట్టి గుట్టలను తోడి టిప్పర్లు, ట్రాక్టర్లలో జేసీబీల సాయంతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు అనుమతుల పేరిట ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. మరికొందరు, అనుమతులు లేకుండానే రాత్రికి రాత్రి వాహనాల్లో నింపుకొని జోరుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీస్ అధికారులు, మైనింగ్ అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రోడ్లపై మట్టి నింపుకున్న వాహనాలు ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో పలువురు పలు విధాలుగా విమర్శలు చేస్తున్నారు. అసైన్డ్ భూముల్లో, పట్టా భూముల రైతులకు ఎంతో కొంత ముట్టజెప్పి దర్జాగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల నామమాత్రంగా మైనింగ్ అధికారుల నుంచి అనుమతులు తీసుకుని వేల ట్రిప్పులు తోలుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. అంతేకాకా ఓవర్‌లోడ్‌తో వాహనాలు బీటీ రోడ్లపై తిరగడంతో అవి దెబ్బతింటున్నాయి.
అనుమతులు గోరంత..తోడేది కొండంత..
పరిగి మండలంలోని ఆయా గ్రామాల్లో మట్టి వ్యాపారం మూడుపువ్వులు..ఆరుకాయలుగా సాగుతుంది. మైనింగ్ అధికారుల నుంచి అరకొర అనుమతులు తీసుకుని గ్రామ శివారులోని గుట్టలను యథేచ్ఛగా తవ్వుకుంటున్నారు. అనుమతుల వెనుక భారీ మట్టి మాఫీయానే కొనసాగుతుందని భావిస్తున్నారు. కొన్ని రోజులు, కొంత స్థలాన్ని తవ్వుకోవచ్చని అనుమతులు తీసుకుని ఇష్టానుసారంగా తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే పాగవేస్తున్నారు. రెవెన్యూ అధికారులు రాత్రి వేళల్లో మట్టి దందాపై చర్యలు తీసుకోవాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. పరిగి మండల పరిధిలోని నజీరాబాద్‌తండా, రంగాపూర్, జాపర్‌పల్లి, రూప్‌ఖాన్‌పేట్, ఇబ్రహీంపూర్, తుంకుల్‌గడ్డ, జాపర్‌పల్లి, సయ్యాద్‌మల్కాపూర్, ఖుదావన్‌పూర్, రాఘవపూర్, రాపోల్, తొండుపల్లి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, పట్టా భూముల్లో ఈ దందా జరుగుతుంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి
మైనింగ్ శాఖ అధికారులు, పోలీస్ యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. రాత్రి వేళల్లో పట్టణ కేంద్రంలో టిప్పర్ల సాయంతో మట్టిని తరలిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇష్టానుసారంగా మట్టిని తవ్వి రియల్‌ఎస్టెట్ వెంచర్లకు, ఫాంహౌస్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ట్రిప్పర్ మట్టిని విక్రయిస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. సంబంధిత అధికారుల కళ్లముందే జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
టిప్పర్లు, జేసీబీలను కొనుగోలు చేసి..
ఈ వ్యాపారాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులే నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ నాయకుల టిప్పర్లయితే ఎవరు పట్టుకోరని ఇష్టానుసారంగా దందాను కొనసాగిస్తున్నారు. దీంతో టిప్పర్లు, జేసీబీలను కొనుగోలు చేసి వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అధికారులు, పోలీసులు ఎవరైనా వాహనాలను ఆపితే వారిపై చివాట్లు పెట్టి ప్రజా ప్రతినిధులతో మాట్లాడించి జారుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకు అనుమతులు ఇవ్వొద్దని, మట్టి దందా చేస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

ఆగని మట్టి దందా!