
అదే అనిశ్చితి!
ఎన్నికల షెడ్యూల్ వచ్చినా రిజర్వేషన్లపై తొలగని ఉత్కంఠ
వికారాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉండటంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినా ఇంకా అనిశ్చిత నెలకొంది. లోకల్ బాడీ పదవుల కోసం ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న వారిలో షెడ్యూల్ వెలువడినా ఆనందం కనిపించడంలేదు. స్థానిక సమరం రాజ్యాంగపరమైన చిక్కులతో ముడిపడి ఉన్న నేప థ్యంలో ఎన్నికలు జరుగుతాయా..? జరగవా..? ఒకవేళ నిర్వహించినా.. ప్రస్తుత రిజర్వేషన్లతో జరుగుతాయా..? లేక పాత వాటి ప్రకారం నిర్వహిస్తారా..? అనే చర్చ ఊపందుకుంది. రిజర్వేషన్లు అను కూలంగా వచ్చినా ఆయా సామాజిక వర్గాల నాయకులు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. కో ర్టు పరిధిలో ఉన్న అంశంపై కావడంతో తీర్చు వచ్చే వరకు ఎదురూ చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై స్పష్టత రావాలంటే మరో వారం రోజులు వేచి చూడక తప్పదు. ఇదిలా ఉండగా రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఎలా ముందుకెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నారు.
ముందుకా..? వెనక్కా..?
లోకల్ బాడీ ఎలక్షన్ ఏడాది కాలంగా ఊరిస్తూ ఎట్టకేలకు షెడ్యూల్ వచ్చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలో ఉండటంతో ఆశావహలు 8వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. అప్పటిదాకా వేచి చూస్తే గ్రూపులు, సంఘాలు, కీలకమైన వ్యక్తు లు దూరమయ్యే అవకాశం ఉంటుందని హై రానా పడుతున్నారు. వారు ఇతరు నేతలకు మాటిచ్చే అవకాశం లేకపోలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అడుగు ముందుకు వేయడమే వారి ముందు ఉన్న కర్తవ్యంగా భావిస్తన్నారు. ఖర్చ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఖర్చు చేస్తూ పోతే పరిస్థితి తమకు ప్రతికూలంగా మారితే పెట్టిన డబ్బు వృథా అవుతుందని అంచనాకు వచ్చారు. దీంతో వారి పరిస్థితి ముందు గొయ్యి.. వెనుక నుయ్యి అన్న చందంగా మారింది.
ఇంకా అన్ రిజర్వుడ్ ఆశలు
ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. లోకల్ బాడీ ఎన్నికల్లో స్లాబ్‌కు లోబడి రిజర్వేషన్లు లేకపోవడంతో అసంతృప్తులు కోర్టును ఆశ్రయించేందుకు వీలు కలుగుతుంది. రాజ్యాంగంలోని 9వ, షెడ్యూల్‌లో చేర్చని ఏ అంశంపైన అయినా కోర్టులు జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుత చట్టాన్ని సవరించి 9వ, షెడ్యూల్‌లో చేర్చే ప్రాసెస్ ఏదీ చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారి చేసింది. మరో వైపు అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించలేదు. ఇలాంటి చట్టం పరిపూర్ణం కాజాలదు. ఈ కారణం చేత కూడా ప్రస్తుతం ఇచ్చిన రిజర్వేషన్లపై కోర్టు అభ్యంతరం చెప్పే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత రిజర్వేషన్లు నిలుస్తాయా..? రద్దువుతాయా..? అనే అయోమయం ఆశావహులను వీడటంలేదు. ఇదే సమయంలో ఆయా కారణాల వల్ల ప్రస్తుత రిజర్వేషన్లు రద్దయ్యే అవకాశాలను విశ్లేశిస్తూ చర్చ ఊపందుకుంది. దీంతో అన్ రిజర్వుడ్ స్థానాలపై ఆశలు పెట్టుకున్న జనరల్ ఆశావహుల్లో ఇంకా ఆశలు పదిలంగానే ఉన్నాయి. 8వ తేదీ కోర్టు తీర్పు కోసం వారు వేచి చూసే ధోరణిలోనే వారు ఉన్నారు.