
గడువుతీరిన కుర్‌కురే తిని బాలుడికి అస్వస్థత
ధారూరు: గడువుతీరిన కుర్‌కురే తిని ఓ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరుకు చెందిన ఇమ్రాన్(11) మంగళవారం మండల కేంద్రంలోని తాండూరు– హైదరాబాద్ ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఓ కిరాణ షాప్‌లో కుర్‌కురే ప్యాకెట్ కొనుగోలు చేసి తిన్నాడు. కొద్దిసేపటికే వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడు తిన్న ప్యాకెట్‌ను పరిశీలించగా ఆగస్టు 10, 2025 వరకే గడువు తీరిపోయింది. సదరు దుకాణ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
నేరాల నియంత్రణలో
సీసీ కెమెరాలు కీలకం
కుల్కచర్ల: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు. మంగళవారం కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో సీసీ కెమెరాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ గ్రామంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా దుకాణదారులు ఏర్పాటుచేయించుకుంటే నేరాలు అదుపుచేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, స్థానిక నాయకులు వెంకట్రాములు, రాజశేఖర్, వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
పూడూరులో
రిజర్వేషన్లు ఖరారు
పూడూరు: పూడూరు మండలానికి సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో ఆశావహులు సంబరాలు చేసుకుంటున్నారు. పూడూరు మండలంలో జెడ్పీటీసీ ఎస్సీ (మహిళ), ఎంపీపీ (ఎస్సీ మహిళ) రిజర్వు కావడంతో ఆయా పార్టీల నాయకులు అభ్యర్థుల వేటలో పడ్డారు. మండల పరిధిలో 13 ఎంపీటీసీ స్థానాలు ఇలా ఉన్నాయి. అంగడిచిట్టంపల్లి (బీసీ మహిళ), ఎన్కేపల్లి(జనరల్), మన్నేగూడ(బీసీ జనరల్), చన్గోముల్(బీసీ జనరల్), చీలాపూర్(ఎస్సీ మహిళ), పూడూరు(జనరల్), సోమన్‌గుర్తి(బీసీ మహిళ), పెద్ద ఉమ్మెంతాల్(ఎస్సీ జనరల్), మేడిపల్లికలాన్(ఎస్సీ జనరల్), కడుమూరు(బీసీ జనరల్), కంకల్(జనరల్ మహిళ), మంచన్‌పల్లి(బీసీ మహిళ), నిజాంపేట్‌మేడిపల్లి(జనరల్ మహిళ)గా రిజర్వ్ అయ్యాయి.
మండల పరిధిలోని 32 పంచాయతీలో..
మండల పరిధిలోని 32 పంచాయతీలకు సర్పంచ్ స్థానాలు ఇలా ఉన్నాయి.. అంగడిచిట్టంపల్లి (బీసీ మహిళ) అంగడిచిట్టంపల్లి (బీసీ జనరల్), బాకాపూర్ (బీసీ జనరల్), చీలాపూర్ (ఎస్సీ మహిళ), చన్గోముల్(బీసీ జనరల్), చింతలపల్లి (ఎస్సీ మహిళ), దేవనోనిగూడ (జనరల్ మహిళ), గట్టుపల్లి(జనరల్), గంగుపల్లి (ఎస్సీ జనరల్), కడుమూరు(ఎస్సీ జనరల్), కండ్లపల్లి(ఎస్సీ మహిళ), కంకల్(ఎస్సీ జనరల్), కెరవెళ్లి(జనరల్), కొత్తపల్లి(జనరల్ మహిళ), మంచన్‌పల్లి (బీసీ మహిళ), మన్నేగూడ(బీసీ మహిళ), మేడికొండ(బీసీ జనరల్), మేడిపల్లికలాన్(బీసీ మహిళ), మీర్జాపూర్(జనరల్), మిట్టకంకల్(బీసీ మహిళ), నిజాంపేట్‌మేడిపల్లి(బీసీ జనరల్), పెద్ద ఉమ్మెంతాల్(ఎస్సీ మహిళ), పుడుగుర్తి(బీసీ మహిళ), పూడూరు(బీసీ జనరల్), కుత్బుల్లాపూర్(బీసీ మహిళ), రాకంచర్ల(ఎస్టీ మహిళ), రేగడిమామడిపల్లి(జనరల్), సిరిగాయపల్లి(జనరల్), సోమన్‌గుర్తి(ఎస్సీ జనరల్), తిమ్మాపూర్(జనరల్ మహిళ), తిరుమలాపూర్(జనరల్ మహిళ), తుర్క ఎన్కేపల్లి(జనరల్ మహిళ), ఎన్కేపల్లి (బీసీ జనరల్)గా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. కాగా 9 నుంచి నామినేషన్ల పక్రియ కొనసాగనుంది.
కృష్ణా నదిలో విద్యార్థి గల్లంతు
నాగార్జునసాగర్: స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్‌పల్లికి చెందిన హర్షవర్ధన్, జ్ఞానేందర్, సుమన్, మణికంఠరెడ్డి, వెంకటేష్, చాణక్య (16)స్నేహితులు. వీరంతా వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరంతా కలిసి నాగార్జునసాగర్ చూడటానికి రెండు బైక్‌లపై వచ్చారు. అందరూ కలిసి నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఫొటోలు తీసుకున్నారు. అనంతరం కొత్త బ్రిడ్జి సమీపంలో చింతలపాలెం వెళ్లే దారి వెంట ఉన్న ఆంజనేయ పుష్కర ఘాట్‌లోకి దిగి స్నానాలు చేస్తుండగా.. చాణక్య నీటి ఉధృతికి కృష్ణా నదిలో కొట్టుకుపోయాడు.

గడువుతీరిన కుర్‌కురే తిని బాలుడికి అస్వస్థత