కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి

Oct 1 2025 10:59 AM | Updated on Oct 1 2025 10:59 AM

కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి

కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి

● రిజర్వేషన్లలో మహిళలకు అన్యాయం ● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

నవాబుపేట: ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నవాబుపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాట్లాడారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డివి మోసపూరిత వాగ్దానాలు అని మండిపడ్డారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. అప్పుల పేరిట ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకొని కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామన్నారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ఢిల్లీలో ధర్నాలు, జీఓలతో నాటకం ఆడుతున్నారని విమర్శించారు. మహిళలపై కేసీఆర్‌కు ఎనలేని అభిమానం ఉందన్నారు. అందుకే ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు, దసరాకు కొత్త చీర ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1,050 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే అందులో 650 బాలికలు స్కూళ్లేనని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడ చేశాడో చెప్పాలన్నారు. కనీసం కొడంగల్‌లోనైనా చేశారా అని నిలదీశారు. మహిళలకు రంగారెడ్డి జిల్లాలో 40 శాతం, వికారాబాద్‌ జిల్లాలో 30 శాతం మాత్రమే రిజర్వేషన్లు కేటాయించి అన్యాయం చేశారని అన్నారు. కేసీఆర్‌ పథకాల పేర్లు మార్చుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. నల్లధనం వెనక్కు తెస్తామన్న బీజేపీ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని.. 15 రూపాయలు కూడా వేయలేదన్నారు. మాయమాటలతో పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టడం లేదన్నారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి పలు గ్రామాలకు చెందిన వారితో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. సబితారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, నాయకులు నాగేందర్‌గౌడ్‌, శుభప్రద్‌పటేల్‌, విజయ్‌కుమార్‌, దయాకర్‌రెడ్డి, బందయ్యగౌడ్‌, భరత్‌రెడ్డి, శాంతకుమార్‌, దాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

అండగా ఉంటాం

రీజినల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చడం ద్వా రా పేద రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని సబితారెడ్డి అన్నారు. నవాబుపేటకు వచ్చిన ఆమెను మండలంలోని చిట్టిగిద్ద, చించల్‌పేట, దాతాపూర్‌ గ్రామాలకు చెందిన భూ బాధిత రైతులు కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూ డాలని వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆమె మీకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని ఎవరూ ఆందోళన చెందాల్సి పని లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement