
దసరాకు ఆకుకూరలేనా!
దుద్యాల్: దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. విజయదశమి రోజు జంతుబలి, మాంసం ఒండుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మద్యం విక్రయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు జంతు బలులు నిషేధం. మద్యం విక్రయించరు. ఈ రెండూ దసరా రోజు దొరికే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ సారి పండుగను ఆకుకూరలతో జరుపుకోవాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అయితే అక్టోబర్ 2వ తేదీ మాంసం దుకాణాలు మూసి ఉంటాయని, ముందు రోజు(అక్టోబర్ ఒకటవ తేదీ) మాంసం తీసుకెళ్లాలని దుకాణ యజమానులు బోర్డులు ఉంచారు.
మాంసం విక్రయించొద్దు
తాండూరు: మున్సిపల్ పరిధిలోని మాంసం దుకాణాలు, హోటళ్లను అక్టోబర్ 2న మూసి ఉంచాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ బి.యాదగిరి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా తాండూరులో మాంసం విక్రయాలు జరప రాదన్నారు. నిబంధనలను పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధన పాటించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని మాంసం దుకాణ యజమానులకు, హోటల్ నిర్వాహకులకు నోటీసులు అందజేశారు.