
మహిళల ఆరోగ్యానికి రక్ష
దౌల్తాబాద్: మహిళల ఆరోగ్యానికి రక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారీ సశక్త్ అభియాన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ప్రతి మహిళకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండలంలో గత వారం రోజులుగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. మంగళవారం స్థానిక పీహెచ్‌సీ ఆవరణలో మెగా హెల్త్ శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. మహిళ శిశు సంక్షేమ శాఖ పోషన్ అభియాన్ కార్యక్రమానికి అనుబంధంగా మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు గుర్తించారు. వారికి అవసరమైన మందులతో పాటు మెరుగైన చికిత్సలు చేస్తున్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యురాలు ప్రియదర్శిని, సూపర్‌వైజర్ రఫీ, పల్లె దవాఖాన డాక్టర్ సంతోష్, ఏఎన్‌ఎంలు ఆశ కార్యకర్తలు ఉన్నారు.
వర్షానికి కూలిన ఇల్లు
దౌల్తాబాద్: మండలంలోని దేవర్‌ఫసల్‌వాద్ గ్రామంలో వర్షానికి గ్రామానికి చెందిన తలారి దస్తప్ప ఇల్లు మంగళవారం కూలింది. ఇటీవల కురిసిన భారీ వానకు ఇల్లు కూలిందని బాధితుడు తెలిపాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ప్రభుత్వం తరఫున బాధితుడికి ఆర్థికసాయం అందించాలని ముదిరాజ్ సంఘం నియోజకవర్గ నాయకుడు కూర వెంకటయ్య కోరారు.
క్రీడలతో ఆరోగ్యానికి మేలు
కొడంగల్ ఏఎంసీ వైస్ చైర్మన్ వేణుగోపాల్
దుద్యాల్: క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో దసరా ప్రీమియర్ లీగ్(క్రికెట్ పోటీలు)ను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయసుతో సంబంధం లేకుండా ఆటలు ఆడాలన్నారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలంగౌడ్, నాయకులు సత్యనారాయణ, నిర్వాహకులు నరేందర్‌గౌడ్, సంతోష్, అనిల్ పాల్గొన్నారు.
హనుమత్ వాహనంపై ఊరేగింపు
అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లిలో వెలిసిన శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాతసేవ, అర్చనలు, ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ గావించారు. అనంతరం నైవేద్యం సమర్పించి ప్రత్యేక హారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి ఆలయ మాడ వీధుల్లో స్వామి వారిని హనుమత్ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ పద్మనాభం, ఈవో నరేందర్, గ్రామస్తులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
కారు అదుపుతప్పి.. ముగ్గురికి గాయాలు
బొంరాస్‌పేట: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన కారు మెకానిక్ సయ్యద్ కిబిరియా తన స్నేహితులైన అయూబ్, సలీమ్‌లతో కలిసి కారులో కర్ణాటకలోని గుర్మిట్‌కల్‌కు వెళుతున్నారు. మార్గమధ్యలో నాగిరెడ్డిపల్లి శివారులో జాతీయ రహదారి 163పై అతివేగంగా కారు నడపడంతో అదుపుతప్పి పక్కన స్తంభాన్ని ఢీకొట్టారు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాల వెంకటరమణ తెలిపారు.

మహిళల ఆరోగ్యానికి రక్ష

మహిళల ఆరోగ్యానికి రక్ష

మహిళల ఆరోగ్యానికి రక్ష

మహిళల ఆరోగ్యానికి రక్ష