
రేడియల్ రోడ్డుకు భూములివ్వం
అనంతగిరి: శంషాబాద్ నుంచి పరిగి రాకంచర్ల మీదుగా చేపట్టే రేడియల్ రోడ్డు ప్రతిపాదనకు తాము భూములు ఇవ్వమని పూడూరు మండలానికి చెందిన రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాకంచర్ల మీదుగా వచ్చే రూట్ అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. తమకున్న కొంత భూమిలో రోడ్డు పోతే జీవనం ఎలా సాగాలని ప్రశ్నించారు. పరిగి, పూడూరు మండలాలోని ఎనిమిది గ్రామాల గుండా ఈ రోడ్డు పోతుందన్నారు. దాదాపు 350 ఎకరాల నల్లరేగడి సాగుభూమి ఉందన్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
రహదారిని రద్దు చేయాలి
పరిగి: రైతుల పొలాల నుంచి వెళ్లే రేడియల్ రోడ్డును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని భూ బాఽధితులు డిమాండ్ చేశారు. దామగుండం నేవీరాడర్ స్టేషన్‌కు వేళ్లేందుకు శంషాబాద్ నుంచి రంగాపూర్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఇటీవల సర్వే నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం భూ బాధితులు పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్ వెంకటేశ్వరికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎనిమిది గ్రామాల్లోని 360 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
పూడూరు మండల భూ బాధితులు

రేడియల్ రోడ్డుకు భూములివ్వం