
మళ్లీ దంచిన వర్షం
తాండూరు రూరల్: వర్షాల జోరు తగ్గడం లేదు. దీంతో మండలంలోని గ్రామాల్లో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గతంలో కురిసిన వానలకే పెద్దఎత్తున పెసర, మినుము పంటలు పాడయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే పత్తి పంట కుదురుకుంటున్న సమయంలో మళ్లీ వాన దంచికొట్టింది. మంగళవారం మధ్యాహ్నం సైతం మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఫలితంగా చేతికి వచ్చిన పత్తి పంట పాడైందని కర్షకులు లబోదిబోమంటున్నారు. పత్తి చేలలో వర్షపు నీరు చేరడంతో మునిగాయి. సంగెంకలాన్, ఐనెల్లి వాగులు పొంగిపొర్లాయి. తాండూరు–చించోళి రోడ్డుపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాగు ఉధృతి తగ్గిన తర్వాత వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
వరుణుడు శాంతించాలని వేడుకోలు
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట చేతికి రావడం కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా వరుణుడు శాంతించాలని కోరుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని, చేతికి వచ్చే క్రమంలో భారీ వర్షాల కారణంగా శ్రమంతా వరదలో పోయిందని మదనపడుతున్నారు. వర్షాలు తగ్గితేనే పత్తి పంట చేతికి వస్తోందని అన్నదాతలు భావిస్తున్నారు.
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
నీట మునిగిన పత్తి తదితర పంటలు
తీవ్ర నష్టం వాటిల్లిందని రైతుల గగ్గోలు