
రూ.కోట్ల భూమి స్వాహా
● పనిమనిషికి మాయమాటలు చెప్పి అక్రమ రిజిస్ట్రేషన్
● సర్వే చేస్తుండగా నిలదీసిన బాధితుడు
● కిరాయి గుండాలతో దాడికి యత్నం
పూడూరు: ఇంట్లో పని చేసే మనిషికి ఆసరాగా ఉండాల్సిన యజమానులు దౌర్జన్యానికి పాల్పడి ఆమె భూమినే కాజేసిన సంఘటన మండలంలో కలకలం రేపింది. రూ.ఐదు కోట్ల విలువ చేసే భూమికి కేవలం రూ.ఐదు లక్షలకే దక్కించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాకంచర్ల గ్రామానికి చెందిన పద్మమ్మ నగరంలోని లింగంపల్లిలో ఓ ఇంట్లో పని చేస్తుంది(పనిమనిషి). ఆమెకు మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్‌లో సర్వే నంబర్ 401లో రెండు ఎకరాల భూమి ఉంది. సదరు ఇంటి యజమానులు పద్మమ్మకు మాయమాటలు చెప్పి గుట్టుగా కుటుంబసభ్యులకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రూ.5 కోట్లకు విలువ చేసే భూమికి కేవలం రూ.5 లక్షలకే చేజిక్కించుకున్నారు. గురువారం సదరు భూమిలో సర్వే చేస్తుండగా పద్మమ్మ కొడుకు సురేశ్ అడ్డుకొని నిలదీశాడు. తామే భూమిని కొనుగోలు చేశామని పోచమ్మ 20 మంది కిరాయి గుండాలతో(సిక్కు) కలిసి తెలపడంతో అవాక్కయ్యాడు. ఎలా జరిగిందని ప్రశ్నించడంతో అతడిపై ఒక్కసారిగా దాడికి యత్నించారు. వెంటనే సురేశ్ గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి వచ్చి సర్వే ఆపే ప్రయత్నం చేశారు.
న్యాయం చేయండి
ఈ మేరకు పోలీసులు గుండాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద కత్తులు, లాఠీలు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక పోచమ్మ కుమారుడు సంపత్ ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతడు కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడని, ఈ వ్యవహారానికి మొత్తం సూత్రధారి అతడేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ పెంటయ్య ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితుడు సురేశ్‌కు న్యాయం చేయాలని గ్రామస్తులు పార్టీలకతీతంగా పోలీసులను కోరారు. ఈ మేరకు చన్గోముల్ కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపారు.