
ఫేక్ ఓటర్లపై విచారణ
● హాజరైన 26 మందిలో 22 మంది నకిలీ ఓటర్లేనని తేల్చిన అధికారులు
● మిగిలిన నలుగురిపైనా అనుమానం, పూర్తి వివరాలు సేకరిస్తామని వెల్లడి
● ఎంకై ్వరీకి రాని మరో 26 మంది
ధారూరు: మండల పరిధిలోని ఎబ్బనూర్‌లో పెద్ద సంఖ్యలో ఫేక్ ఓటర్లు ఉన్నారనే ఫిర్యాదులపై డీఆర్‌ఓ మంగీలాల్ విచారణ చేపట్టారు. ఓటరు జాబితాలో పేర్లున్న సుమారు 52 మందికి అధికారులు ముందుగానే నోటీసులు అందజేశారు. ఫేక్ ఓటర్లు కాని వారు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈఅంశంపై గత బుధ, గురువారాల్లో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఎంకై ్వరీ చేపట్టారు. మొదటి రోజు 12 మంది, రెండో రోజు 14 మంది మొత్తం 26 మంది హాజరు కాగా వీరిలో 22 మంది ఫేక్ ఓటర్లేనని అధికారులు తేల్చారు. మిగిలిన నలుగురు తమకు కేవలం ఎబ్బనూరులో మాత్రమే ఓటు హక్కు ఉందని వాదించారు. అయితే వీరి ఓట్లు కూడా తాండూరులో ఉన్నాయనే అనుమానం ఉందని, దీనిపై కూడా విచారణ జరుపుతామని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. మరో 26 మంది విచారణకు హాజరు కాలేదు. వీరు రాకపోతే ఫేక్ ఓటర్లుగా నిర్ధారిస్తామని స్పష్టంచేశారు.