
లైసెన్స్ సస్పెన్షన్
బషీరాబాద్: ‘విచారణ మమ’శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం స్పందించారు. ఆయన ఆదేశంతో బషీరాబాద్‌లోని ‘సాయి ధనలక్ష్మి’ ఫర్టిలైజర్ షాపు లైసెన్స్‌ను మరో పది రోజుల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ఏడీఏ కొమురయ్య ప్రకటించారు. అప్పటి వరకు షాపులో ఎరువుల విక్రయాలు నిర్వహించవద్దని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యజమానిని హెచ్చరించారు. అనంతరం నావంద్గీ సొసైటీలో యూరియా విక్రయాలపై సీఈఓ వెంకటయ్య నుంచి వివరాలు తెలుసుకున్నారు. అధిక ధరలకు విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే సొసైటీలకు సైతం యూరియా సరఫరా నిలిపివేస్తామన్నారు. మండలానికి మరో వంద టన్నుల యూరియా అవసరమని అధికారులు ఏడీఏకు తెలిపారు.
రికార్డుల తనిఖీ..
యూరియా, డీఏపీ వంటి ఎరువుల కోసం అష్టకష్టాలు పడుతున్న సమయంలో తమ అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయించారని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై వారం రోజుల క్రితం విచారణ చేపట్టిన వ్యవసాయ శాఖ అధికారులు దుకాణ నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం కంటి తుడుపు చర్యలతో సరిపెట్టే ప్రయత్నం చేయగా, సాక్షి ఈఅంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈనేపథ్యంలో ఏఓ అనితతో కలిసి గురువారం ఏడీఏ కొమురయ్య గురువారం మరోసారి బషీరాబాద్‌లోని ఫర్టిలైజర్ షాపు రికార్డులను తనిఖీ చేశారు. వారం రోజుల క్రితం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంతృప్తికర సమాధానం చెప్పకపోవడంతో మరో పది రోజుల పాటు లైసెన్స్‌ను సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించేలా చూడాలని కోరారు.
అధిక ధరలకు ఎరువులు విక్రయించిన షాపుపై చర్యలు
ఆదేశాలు జారీ చేసిన తాండూరు ఏడీఏ కొమురయ్య
హర్షం వ్యక్తం చేసిన రైతులు

లైసెన్స్ సస్పెన్షన్