
వరండా చదువులు ఇంకెన్నాళ్లు !
బషీరాబాద్: మండలంలోని జీవన్గీ జెడ్పీ ఉన్నత పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 102 మంది విద్యార్థులు ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరడంతో నాలుగు గదులకు తాళం వేశారు. ఉన్న మూడు గదుల్లో 8 నుంచి 10 తరగతి వరకు.. మిగిలిన 6, 7 తరగతులను వరండాలో నిర్వహిస్తున్నారు. చిన్నపాటి వర్షం పడిన బోధనకు అంతరాయం కలుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తలుపులు, కిటికీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటున్నారు. వంటగది పరిస్థితి కూడా దారుణంగా ఉంది. మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు నిర్వాహకులు జంకుతున్నారు.
రూ.30 లక్షలు వెనక్కు
మన ఊరు.. మనబడి పథకం కింద గత ప్రభుత్వం రూ.30లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో కొత్త తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా పనులు ప్రారంభం కాకుండానే నిధులు వెనక్కు వెళ్లాయి. చిన్నపాటి మరమ్మతులతో సరిపెట్టి విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
నిరుపయోగంగా బల్లలు
పాఠశాలల ప్రారంభ సమయంలో విద్యార్థులు కూర్చునేందుకు ప్రభుత్వం 60 డ్యూయల్ బల్లలు పంపిణీ చేసింది. ఇప్పటి వరకు వాటిని వినియోగించలేదు. దీంతో నిరుపయోగంగా మారాయి.
నిధులు మంజూరు చేయాలి
పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. ప్రస్తుతం మూడు గదులు మాత్రమే అందుబాటులో ఉండటంతో 8 నుంచి 10వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. 6, 7వ తరగతి విద్యార్థులకు వరండాలో బోధన చేస్తున్నారు. వర్షం పడ్డా, ఎండ ఎక్కువగా ఉన్నా ఇబ్బంది పడుతున్నాం.
– 6వ తరగతి విద్యార్థులు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
పాఠశాలలో గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. గతంలో మన ఊరు.. మనబడి పథకం కింద నిధులు మంజూరైన పనులు జరగలేదు. ప్రస్తుతం మూడు తరగతులను వరండాలో నిర్వహిస్తున్నాం. పాఠశాలకు మంజూరైన బల్లలను వినియోగిస్తాం.
– దూస రాములు, ఎంఈఓ
శిథిలావస్థలో జీవన్గీ జెడ్పీ ఉన్నత పాఠశాల భవనం
నాలుగు గదులకు తాళం
ఉన్న మూడింటిలోనే 5 తరగతులు
పట్టించుకోని పాలకులు, అధికారులు
ఇబ్బందుల్లో విద్యార్థులు