
మాకేదీ.. ‘ఇందిరమ్మ’?
● వాల్యానాయక్‌తండాకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాని వైనం
● ఆందోళన వ్యక్తంచేస్తున్న గిరిజనులు
దుద్యాల్: ఇందిరమ్మ మా ఊరికి ఇల్లేదమ్మా.. అంటూ మండల పరిధిలోని వాల్యానాయక్‌తండా గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుద్యాల్ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈగ్రామానికి ఇందిరమ్మ పథకం మొదటి విడతలో ఒక్క ఇల్లు కూడా మాజూరు కాలేదు. తండాలో చాలా మంది ఆర్హులు ఉన్నా అధికారులు, పాలకులు తమపై దయ చూపలేదని వాపోతున్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇందుకోసం పక్కాగా వివరాలు సేకరిస్తున్నామని చెప్పిన అధికారుల మాటలన్నీ అబద్ధాలేనని పేర్కొంటున్నారు. అధికారులు చేసిన సర్వేలో తమ గ్రామంలోని ఒక్కరికై నా ఇందిరమ్మల ఇంటికి అర్హత లేదా అని ప్రశ్నిస్తున్నారు. వాల్యానాయక్‌తండాలో 600 జనాభా నివసిస్తున్నారు. సుమారు 80 వరకు ఇళ్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది పక్కా ఇల్లు లేవు. శిఽథిలావస్థకు చేరిన ఇళ్ల పైకప్పులపై టార్పాలిన్ కవర్లు వేసుకుని జీనవం సాగిస్తున్నారు. ఒక్కసారి తమ తండాను, నివాసాలను పరిశీలించాలని స్థానికులు హన్మిబాయి, రాములు నాయక్, శివనాయక్, రవినాయక్, గోప్యానాయక్ తదితరులు కోరారు.
న్యాయం చేయాలి
నాకు ఉండేందుకు గూడు లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పలుమార్లు అధికారులు, నాయకులకు విన్నవించా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాతండాకు ఇళ్లు ఇస్తారని ఆశపడ్డాం. కానీ ఒక్కరికి కూడా ఇల్లు రాకపోవడం బాధగా ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలి.
– మాణిక్యనాయక్, వాల్యానాయక్‌తండా