
పేదలకు దన్నుగా..
బీజేపీ.. పేదల ప్రభుత్వం
వికారాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ (వస్తు సేవల పన్ను) స్లాబ్‌ల కుదింపుతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు జీఎస్టీ(గూడ్స్ సర్వీస్ ట్యాక్స్) విధింపులో నాలుగు స్లాబ్‌లు ఉండగా వాటిని రెండింకి కుదించారు. పేదలు, రైతులు, మహిళలు, యువత వినియోగించే అనేక వస్తువులపై పన్ను భారాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పై వర్గాల ప్రజలు వినియోగించే వస్తువులు, 12 రకాల సేవలు, 18 శాతం ఉన్న వాటిని ఐదు శాతం స్లాబ్‌లోకి మార్చారు. ఇందులో అనేక రకాల నిత్యావసర వస్తువులు సైతం ఉన్నాయి. దీంతో కుటుంబ ఖర్చులు కూడా తగ్గనున్నాయి. 18, 12 శాతం జీఎస్టీ ఉన్న కొన్ని రకాల వస్తువులను ఐదు శాతానికి తగ్గించడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఖర్చులే కాకుండా వ్యక్తిగత ఖర్చు కూడా సగటున 10 శాతం ఆదా అయ్యే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మన జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న రైతులు, మహిళలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో భారీ మేలు జరగనుంది.
రైతులు, మహిళలకు లబ్ధి
జిల్లాలో 2.8 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరు వినియోగించే వస్తువుల్లో ప్రధానమైనవి ఎరువులు, విత్తనాలపై ప్రభుత్వం ఇప్పటికే రాయితీలు వర్తింప జేస్తోంది. కొంత కాలంగా వ్యవసాయ వస్తువులపై రాయితీలు తగ్గిపోవడమే కాకుండా పన్నులు వడ్డింపు పరిధిలోకి వెళ్లాయి. దీంతో సాగు పెట్టుబడి ఖర్చులు పెరిగి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రైతుకు వచ్చే నికర లాభం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దీంతో నష్టాల పాలవుతున్నారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై పన్ను భారం తగ్గనుంది. రైతులు వినియోగించే ట్రాక్టర్ల టైర్లు, విడిభాగాలు, కొన్ని రకాల పురుగు మందులు, సూక్ష్మ పోషకాలు, స్ప్రింక్లర్లు, డ్రిప్ పైపులు కొనుగోలు ఖర్చులు తగ్గనున్నాయి. 18 నుంచి 12 శాతం స్లాబ్‌లోని వాటిని ఐదు శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. దీంతో జిల్లాలోని 2.8 లక్షల రైతులకు మేలు చేకూరనుంది. కుట్టు మిషన్లు, వాటి విడిభాగాలు, మహిళలు, చిన్నారుల కోసం వినియోగించే పలు రకాల వస్తువులపై పన్ను భారం తగ్గనుంది. జిల్లాలోని మూడు లక్షల పైచిలుకు మహిళలకు లబ్ధి చేకూరుతుంది.
తగ్గనున్న పన్ను భారం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై పన్ను భారం తగ్గనుంది. వారు వినియోగించే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. టీవీలు, బైక్‌లు, చిన్న, మధ్య శ్రేణి కార్లు, వైద్య పరికరాలు, చిన్న పిల్లల కోసం వినియోగించేవి, విద్యార్థులకు అవసరమైన వస్తువులపై కూడా పన్నుల భారం తగ్గించింది.
జీఎస్టీ స్లాబ్‌ల కుదింపుతో మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి
వ్యవసాయ ఉపకరణాలన్నీ ఐదు శాతం స్లాబ్‌లోకి..
జిల్లాలో 2.8 లక్షల మంది రైతులకు ప్రయోజనం
మహిళలు, యువతకు ఎంతో మేలు
మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షమే. ఏ సంస్కరణలు తెచ్చినా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయి. జీఎస్టీ స్లాబ్‌ల కుదింపు నిర్ణయం ఎంతో మంచిది. ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రాజశేఖర్‌రెడ్డి, బీజేపీ, జిల్లా అధ్యక్షుడు

పేదలకు దన్నుగా..