ధాన్యం మిల్లులకు తరలించండి
పరిగి: రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. శుక్రవారం మండలంలోని సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది ఉండరాదనే జిల్లా వ్యాప్తంగా 128 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 13,425 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వివరించారు. ఇందుకు గాను రూ.12.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఇష్టానుసారంగా తూకాలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తూకం వేయాలని ఆదేశించారు. రైతులు ధాన్యం విక్రయించిన వారం రోజుల వ్యవధిలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. అన్నదాతలు దళారులను నమ్మి మోసపోవరాదని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని, కొరత ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్‌బాబు, డీఎం మోహన్‌కృష్ణ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్


