ఆమ్దాని ఘనం.. సౌకర్యాలు శూన్యం
తాండూరు: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ప్రభుత్వ కార్యాలయాల పనితీరు. సర్కారుకు ఏటా రూ.కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న ప్రభుత్వ శాఖలకు తాండూరులో సొంత గూడు లేకుండా పోయాయి. పట్టణంలో ప్రభుత్వ భవనాలు పదుల సంఖ్యలో వృథాగా ఉన్నా అద్దె భవనాలలోనే అధికారులు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. తాండూరు పట్టణంలో సబ్‌రిజిస్ట్రార్, గనులశాఖ, ఎకై ్సజ్ శాఖల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. కానీ వీటికి సొంత భవనాలు మాత్రం లేవు. విపత్కర సమయంలో ఉపయోగపడే అగ్నిమాపక శాఖకు సైతం శాశ్వత భవనం లేకపోవడం గమనార్హం.
శంకుస్థాపన చేసినా..
తాండూరు పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు లేక దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా తాండూరు సబ్ రిజిస్ట్రార్, ఎకై ్సజ్, గనుల శాఖ, కార్మిక శాఖ కార్యాలయం లాంటివి ఇప్పటికి అద్దె భవనాల్లోనే సేవలు అందిస్తున్నాయి. అవి కూడా రెసిడెన్షియల్ ఇళ్ల మధ్యలో కార్యాలయాలున్నాయి. గత ప్రభుత్వాలు సొంత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటివరకు నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు.
20 ఏళ్లు గడుస్తోంది
స్థానికంగా సబ్ రిజిస్ట్రార్, గనుల శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నారు. మండల ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో సబ్‌రిజిస్ట్రార్, గనులశాఖ కార్యాలయాలకు నాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వ భవనాలను నిర్మించలేకపోయారు. ఏళ్లు గడుస్తున్నా భవన నిర్మాణానికి నోచుకోవడం లేదు. దీంతో సిబ్బందితో పాటు, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. అధికారుల చిత్తశుద్ధి లోపం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో పనులు కొనసాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎకై ్సజ్ శాఖ ద్వారా ఏటా తాండూరు నుంచి రూ.200 కోట్ల ఆదాయం సమకూరుతోంది. కానీ ఎకై ్సజ్ శాఖ కార్యాలయ భవనం మాత్రం ఇప్పటికి ఇళ్ల మధ్యనే కొనసాగుతుంది.
చిన్న గదుల్లోనే..
సంవత్సరానికి సబ్‌రిజిస్ట్రార్, గనులశాఖ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. భవన నిర్మాణానికి నిధులు పుష్కలంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వంతో పనులు ప్రారంభం కావడం లేదు. రైల్వేస్టేషన్ సమీపంలో అద్దె భవనంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం చిన్న గదులతో ఉండటంతో సిబ్బందికే సరిపోవడం లేదు. దీంతో స్థానికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. గనులశాఖ కార్యాలయం కూడా అంతే. చిన్న గదుల్లోనే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
అద్దె భవనాల్లో సర్కారు సేవలు
నిర్మాణానికి నోచుకొని సబ్‌రిజిస్ట్రార్, గనులశాఖ కార్యాలయాలు
ఇబ్బంది పడుతున్న సిబ్బంది, ప్రజలు


