తగ్గేదేలే !
కొడంగల్ అభివృద్ధిలో
సీఎం ప్రత్యేక చొరవతో శరవేగంగా కొనసాగుతున్న పనులు
● చురుగ్గా 220 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం ● తుదిదశకు మున్సిపల్ కార్యాలయం ● పిల్లర్ స్థాయిలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ● పారిశ్రామికవాడ దిశగా అడుగులు
కొడంగల్: సమీప భవిష్యత్‌లో కొడంగల్ రూపురే ఖలు మారిపోనున్నాయి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వరద పారిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం అభివృద్ధి పనులు భూమిపూజ దాటి కార్యరూపం దాల్చాయి. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాట్లుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు. భవన నిర్మాణాలకు ఒక్కో మండలానికి రూ.7.13 కోట్ల చొప్పున రెండు మండలాలకు కలిపి రూ.14.26 కోట్లు మంజూరు చేశారు. దుద్యాల్ మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా ఒకటేమిటి రూ.వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.
నిధుల మంజూరు ఇలా..
కొడంగల్ మండలం ఎరన్‌పల్లి శివారులో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించనున్నారు. భవన నిర్మాణం, మౌలిక వసతుల కోసం రూ.124.50 కోట్లు మంజూరు చేశారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం రూ.46 కోట్లు విడుదల చేశారు.ప్రభుత్వ ఫిజియో థెరపీ కళాశాల, పారామెడికల్ కళాశాల నిర్మా ణం కోసం రూ.27 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్ పట్టణంలో 220 బెడ్ల ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రిని నిర్మాణానికి రూ.27 కోట్లు కేటాయించారు. కోస్గిలో ఇంజనీరింగ్ కళాశాల కోసం రూ.30 కోట్లు, మహిళా డిగ్రీ కళాశాల, మౌలిక వసతుల కల్పనకు రూ.11 కోట్లు మంజూరు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ, మైనార్టీ వెల్ఫేర్ గురుకులాలకు అధునాతన వసతులతో కొత్త భవనాల నిర్మాణం కోసం ఒక్కోదానికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ముందుగా రూ.2,945 కోట్లు మంజూరు చేశారు. తర్వాత పథకం సామర్థ్యం పెంచి నిధుల ను రెట్టింపు చేశారు. కొడంగల్‌లో ఆర్‌అండ్‌బీ అతి థి గృహం నిర్మించడానికి రూ.6 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈ పనులు ఫిల్లర్‌స్థాయిలో ఉన్నాయి. నియోజకవర్గంలో రోడ్ల విస్తరణకు రూ.344 కోట్లు, పలు పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేశారు.
ఏడాదిలోపు పనులు పూర్తయ్యేలా..
నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఏడాదిలోపు పూర్తయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.. కొడంగల్ పట్టణంలో చేపట్టిన 220ల పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణం తుది దశకు చేరుకోగా.. ఆర్‌అండ్‌బీ అతిథి గృహ నిర్మాణ పనులు పిల్లర్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా సమీకృత గురుకులాలు, మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారా మెడికల్ కళాశాల, స్కిల్ యూనివర్సిటీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల,పీజీ కళాశాల భవన నిర్మాణాల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
పారిశ్రామికం వైపు అడుగులు
నియోజవకర్గ పరిధిలోని దుద్యాల్ మండలం పోలేపల్లి, హకీంపేట, లగచర్ల గ్రామాల శివారులో సుమారు 1,200 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తికా వచ్చింది. రైతులకు పరిహారం చెల్లిస్తున్నారు.


