నిర్లక్ష్యపు నీడలో నిఘా నేత్రం | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు నీడలో నిఘా నేత్రం

Published Fri, Dec 15 2023 4:38 AM

శివాజీ చౌక్‌లో పనిచేయని కెమెరా - Sakshi

కొడంగల్‌: కొడంగల్‌ మున్సిపల్‌ పరిధిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో ప్రమాదాలు.. చోరీలు జరిగిన కేసుల విషయంలో నిందితుల గుర్తింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు గతంలో దాతల సహకారంతో కొడంగల్‌తో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానం చేశారు. మండల పరిధిలోని మేజర్‌ గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలను బిగించారు. గ్రామ పోలీస్‌ అధికారులను నియమించి శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సీసీ కెమెరాల ఏర్పాటు తప్పిస్తే వాటి నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో వాటిలో మెజార్టీ కెమెరాలు ప్రస్తుతం పనిచేయడం లేదు.

కొడంగల్‌లో ...

మున్సిపల్‌ పరిధిలోని అంబేడ్కర్‌ చౌరస్తా, బస్టాండ్‌ ఆవరణ, జాతీయ రహదారి, వినాయక చౌరస్తా, రషీద్‌ పాన్‌షాపు, గాంధీనగర్‌, బాలాజీనగర్‌, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల, హైవే పోలీస్‌ స్టేషన్‌, కొడంగల్‌ పోలీస్‌ స్టేషన్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కొన్ని ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ పోలీస్‌ స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై తుంకిమెట్ల, నాగిరెడ్డిపల్లి, రేగడి మైలారం, రావులపల్లి, చంద్రకల్‌ గ్రామాల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. తెలంగాణ కర్నాటక సరిహద్దు గ్రామాల దగ్గర సీసీ కెమెరాలు లేవు. మహబూబ్‌నగర్‌–తాండూరు రోడ్డుపై సీసీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే గుర్తించడం కష్టంగా మారింది. కొడంగల్‌లో 50కు పైగా కెమెరాలు ఉండగా అందులో నాలుగు మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. బొంరాస్‌పేట మండలంలో 8 కెమెరాలు ఉండగా ఒకటి మాత్రమే పనిచేస్తోంది. దౌల్తాబాద్‌లో 8 కెమెరాలు ఉండగా రెండు తప్ప మిగతావి పనిచేయడం లేదు.

పశువుల దొంగతనాలు...

నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దొంగలు పశువులను అపహరిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లుగా పశువుల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటిముందు ఉన్న పశువులు కనిపించకపోయేసరికి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొడంగల్‌ మండల పరిధిలోని రుద్రారం, చిట్లపల్లి, హస్నాబాద్‌ గ్రామాలతో పాటు దౌల్తాబాద్‌, బొంరాస్‌పేటలో పశువుల దొంగతనాలు జరిగాయి. లక్షల విలువ చేసే ఎద్దులు, ఆవులు, గేదెలు, మేకలను అపహరిస్తున్నారు. దొంగలు పశువులను వాహనాల్లో తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. వెంటనే సీసీ కెమెరాల మరమ్మతులు చేయించడంతో పాటు అవసరమైన చోట నూతన కెమెరాలు బిగించాలని.. అలాగే పోలీసు సిబ్బంది రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పనిచేయని సీసీ కెమెరాలు

నిందితుల గుర్తింపులో తీవ్ర జాప్యం

పట్టించుకోనిప్రజాప్రతినిధులు, అధికారులు

మరమ్మతులు చేస్తాం

నేను బాధ్యతలు తీసుకోకముందు సీసీ కెమెరాలు అమర్చారు. వాటిలో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల పనిచేయడం లేదు. త్వరలో వాటి మరమ్మతులు చేయిస్తాం. గ్రామాల్లో కూడా పనిచేయని వాటి స్థానంలో కొత్తవాటిని బిగించడానికి దాతల సహకారం కోరుతాం. నియోజకవర్గంలో దొంగతనాలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి.

– రాములు, సీఐ, కొడంగల్‌

అంబేడ్కర్‌ చౌరస్తాలో సీసీ కెమెరాలు
1/2

అంబేడ్కర్‌ చౌరస్తాలో సీసీ కెమెరాలు

2/2

Advertisement
 

తప్పక చదవండి

Advertisement