డీఎస్సీలో ఇష్టానుసారంగా రూల్స్ మార్పు
టాప్ ర్యాంకర్స్‌కు అన్యాయం
స్పోర్ట్స్ కోటా పేరుతో నిలువునా మోసం
పరీక్షల నిర్వహణ, ఎంపికల్లో అంతులేని అక్రమాలు
సీబీఐతో విచారణ చేయించాలని యువత డిమాండ్
గొంతు నొక్కేశారు!
సాధారణంగా నియామకాల్లో అభ్యర్థుల పరిశీలన కోసం 1:2 లేదా 1:3 నిష్పత్తిలో జాబితాలు విడుదల చేస్తారు. కానీ, ఈ డీఎస్సీలో వింతగా 1:1 నిష్పత్తిలోనే మెరిట్ లిస్టులను విడుదల చేయడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు ప్రత్యామ్నాయ అవకాశం లేకుండా పోయింది. మరొక విచిత్రమేమిటంటే 1:1 లిస్టులో పేర్లున్న అభ్యర్థులకు సైతం ఉద్యోగం రాకపోవడం. ఆ ఎంపిక జాబితాలో పేర్లుండి సర్టిఫికెట్ పరిశీలనకు హాజరైన సమయంలో అనర్హులని తిప్పి పంపారు. అన్ని అర్హతలున్నా అనర్హులని ముద్ర వేసి తెరవెనుక అనుకూలమైన వారికి పోస్టులు అమ్ముకున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి.
చిత్తూరు కలెక్టరేట్ : లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటమాడింది. ఎంతో కాలంగా ఎదురుచూసి, రాత్రింబగళ్లు కష్టపడి చదివిన అర్హులైన అభ్యర్థులకు డీఎస్సీ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేస్తూ అర్హులకు మొండిచేయి చూపించింది. బాధిత డీఎస్సీ అభ్యర్థులను నిలువునా ముంచేసింది. పరీక్షల నిర్వహణ నుంచి ఎంపిక ప్రక్రియ వరకు ప్రతి అడుగులోనూ అంతులేని అక్రమాలు చోటుచేసుకోవడంతో.. ‘ఇది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ’ అంటూ అభ్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.
రూల్స్ మార్చేశారు
పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకలా.. ఎంపిక ప్రక్రియకు వచ్చేసరికి మరోలా నిబంధనలను మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు రావాల్సిన చోట, తెరవెనుక జరిగిన మార్పుల వల్ల టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు సైతం నష్టపోవాల్సిన దుస్థితి వచ్చింది. నిబంధనలను తుంగలో తొక్కి, తమకు నచ్చిన వారికి లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు సర్కారు ఈ విధమైన మార్పులకు పాల్పడిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
అర్హుల పొట్టగొట్టారు!
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పెద్ద వివాదంగా మారింది. క్రీడల్లో ఎలాంటి ప్రవేశం లేని వారికి, నకిలీ సర్టిఫికెట్లు ఉన్నవారికి ఈ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టేశారు. నిజమైన క్రీడాకారులు, అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
లిస్టులో పేరున్నా.. అనర్హులే!
అధికారిక మెరిట్ లిస్టులో పేర్లు ఉన్నా చంద్రబాబు సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. మెరిట్ లిస్టులో టాప్‌లో ఉన్న అభ్యర్థులను సైతం ఏదో ఒక చిన్న సాంకేతిక కారణం చూపించి అనర్హులు అంటూ ముద్ర వేసింది. అర్హులను పక్కనబెట్టి, వెనుక వరుసలో ఉన్న వారికి ఉద్యోగాలు కట్టబెట్టడానికే ఈ అనర్హత డ్రామా ఆడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
సీబీఐతో విచారణ జరపాల్సిందే
పరీక్షల నిర్వహణ, కీ విడుదల, మెరిట్ లిస్టుల ప్రకటన, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని నిరుద్యోగ యువత మండిపడుతోంది. విద్యాశాఖ అధికారుల తీరుపై నమ్మకం పోయిందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని యువత, నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తోంది.


