అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ షురూ | - | Sakshi
Sakshi News home page

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ షురూ

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM

తిరుపతి సిటీ: ఎస్వీయూలో 63 నుంచి 68 వరకు ఈనెల 10వ తేదీన జరగనున్న కాన్వొకేషన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్‌ కార్డులను శుక్రవారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎగ్జామినేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కే.సురేంద్రబాబు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎస్వీయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంపద్రించి తమ హాల్‌టికెట్‌ నంబర్లను పొందుపరచి అడ్మిట్‌ కార్డులు పొందవచ్చని వెల్లడించారు. అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ కాకపోయినా, సమస్యలు ఎదురైనా వర్సిటీ ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రి తనిఖీ

తిరుపతి తుడా: స్థానిక ఆర్సీ రోడ్డులోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని గురువారం విజయవాడ రీజియన్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర విభాగం, ఇన్‌ పేషెంట్ల వార్డులు, స్టోర్స్‌, రెడీయాలజీ, ఫిజియోథెరపీ తదితరుల విభాగాలతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అసంపూర్తిగా ఉన్న పాత ఓపీ భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రీజియన్‌ డైరెక్టర్‌ రామారావు, మెడికల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఈఈ, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్యాంబాబు పాల్గొన్నారు.

డీసీఓగా సురేష్‌కుమార్‌

తిరుపతి అర్బన్‌: జిల్లా కో–ఆపరేటివ్‌ అధికారిగా సురేష్‌కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి డివిజనల్‌ కో–ఆపరేటివ్‌ అధికారిగా పనిచేస్తున్న ఆయనకు జిల్లా అధికారి బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు ఆయన కలెక్టరేట్‌లోని తమ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పర్యాదపూర్వకంగా కలిశారు. డీసీఓగా పనిచేస్తున్న నాగవర్థి మే 31న ఉద్యోగ విరమణ పొందారు. ఈ క్రమంలో డివిజనల్‌ అధికారికి బాధ్యతలు కట్టబెట్టారు.

నోటీసులకు వివరణ ఇచ్చిన ఉద్యోగులు

తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఇటీవల సంచలం సృష్టించిన నకిలీ చలానాల వ్యవహారంపై వర్సిటీ అధికారులు బుధవారం 9 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు మరో ఉద్యోగికి సైతం ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఉద్యోగులు గురువారం వర్సిటీ అధికారులకు నకీలి చలానాల వ్యవహారంలో తమ పాత్రపై లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. దీంతో ఉద్యోగుల వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

సర్వే ఏడీగా రాంప్రసాద్‌

తిరుపతి అర్బన్‌: జిల్లా సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎస్‌ఎస్‌ రాంప్రసాద్‌ గురువారం కలెక్టరేట్‌లోని తమ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో అడిషనల్‌ ఏడీగా పనిచేస్తున్న ఎస్‌ఎస్‌ రాంప్రసాద్‌కు ఏడీగా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు జిల్లాలో ఏడీగా పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌ కర్నూల్‌ జిల్లాకు బదిలీపై వెళ్లారు.

భూ సర్వేను చాలెంజ్‌గా తీసుకోండి

భూ సర్వే ప్రక్రియను పూర్తి చేయడానికి గట్టిగా పనిచేయాల్సి ఉందని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్వే ఏడీకి స్పష్టం చేశారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు.

ఆ బీఎల్వోలపై

శాఖాపరమైన చర్యలు

తిరుపతి అర్బన్‌: సర్‌ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సరవణ ప్రక్రియ అంశంతోపాటు మ్యాపింగ్‌ ఇంటింటా సర్వేలో వెనుకబడిన బీఎల్వోలపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులుతో కలసి బీఎల్వోలతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న బీఎల్వోలు పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. అలాగే సర్‌పై సమీక్ష సమావేశాలకు గైర్హాజరు అవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తిరుపతి ఆర్డీవో రామ్మోహన్‌తోపాటు ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement