విద్యుత్‌ షాక్‌తో యువ రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో యువ రైతు మృతి

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM

– యాతలూరులో విషాదం

వెంకటగిరి రూరల్‌ : విద్యుత్‌ షాక్‌తో యువ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని యాతలూరులో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఎస్‌ఐ బ్రహ్మనాయుడు కథనం.. యాతలూరు గ్రామానికి చెందిన నాగవోలు ప్రసాద్‌రెడ్డి (33) గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో కూలీలతో పనులు చేయించారు. పొలం సమీపంలోని వ్యవసాయ మోటారు వద్ద ప్రమాదశాత్‌ విద్యుత్‌ ఘాతానికి గురయ్యారు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రసాద్‌రెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి ఏడాదిన్నార వయసు ఉన్న బాబు, భార్య ఉన్నారు. ప్రసాద్‌ మృతి చెందడంపై యాతలూరు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ బ్రహ్మనాయుడు తెలియజేశారు.

పరిశోధన అంశాలపై చర్చ

చంద్రగిరి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాలలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన జెనెటిక్స్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగానికి సంబంధించిన పరిశోధన అంశాలపై మూడు రోజులపాటు జరగనున్న చర్చా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ సత్యనారాయణ వర్చువల్‌ విధానంలో మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనువైన నూతన విత్తన రకాల రూపకల్పనపై దృష్టిసారించాలన్నారు. వర్సిటీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.మునిరత్నం మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశోధన నైతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎం.రెడ్డి శేఖర్‌, వర్సిటీ జెనెటిక్స్‌ విభాగపు అధిపతి డాక్టర్‌ ఎస్‌.వసుంధర, ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎల్‌వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement