స్పోర్ట్స్‌ కోటా వెబ్‌సైట్‌లో పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ కోటా వెబ్‌సైట్‌లో పెట్టాలి

Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM

● నిష్పక్షపాతంగా సీబీఐ విచారణ జరిగితీరాల్సిందే ● నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం దారుణం ● మెగా డీఎస్సీ డీల్‌లో కోచింగ్‌ సెంటర్ల పాత్ర ఉందా? ● వాస్తవాలు నిగ్గుతేల్చాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌

డీఎస్సీపై సమగ్ర విచారణకు ఆదేశించాలి

సీబీఐ విచారణకు ఆదేశించాలి

డీఎస్సీలో అవినీతి జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలి. త్రుటిలో ఉద్యోగాన్ని కోల్పోయిన ఎంతో మంది అభ్యర్థులు నేడు బాధపడుతున్నారు. వారి అనుమానాలను నివృత్తి చేయాలంటే సమగ్ర విచారణ జరగాలి. దీంతో పాటు మెగా డీఎస్సీ ప్రక్రియలో కొంతమంది కోచింగ్‌ సెంటర్ల ప్రతినిధుల హస్తం సైతం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తక్షణం ప్రభుత్వం నిజాలను నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది.

– సుందర్‌రాజు, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు, తిరుపతి

ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగం దారుణం

కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్‌ కోటా కింద అభ్యర్థులకు పరీక్షలు లేకుండా నేరుగా ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం దారుణం. ప్రభు త్వం నిజాయితీగా డీఎస్సీ ప్రక్రియ జరిపి ఉంటే తక్షణం స్పోర్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచాలి. సుమారు 460 మందికి పైగా అనర్హులు ఉద్యోగాలు పొందార నే అనుమానాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.

– అశోక్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు, తిరుపతి

అవినీతి జరగనప్పుడు భయమెందుకో?

డీఎస్సీలో అవినీతికి అస్కారమేలేదంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పుడు తక్షణం విచారణకు ఆదేశించాలి. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ధ్రువపత్రాలు మెరిట్‌లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో ప్రజల ముందు ఉంచడంలో ఎందుకు భయపడుతున్నారు. తక్షణం వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. డీఎస్సీ వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచాలి.

– ఆర్‌ ఆషా, పీడీఎస్‌ఓ, జిల్లా కార్యదర్శి, తిరుపతి

తిరుపతి సిటీ: మెగా డీఎస్సీ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్‌ సమాధానం చెప్పాలని, నిజాలు నిగ్గు తేల్చాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా విషయంలో అనర్హులకు ఉద్యోగాలు లభించాయని, ఆ కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల వివరాలు, ధ్రువపత్రాలు తక్షణం ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఉంచాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో పాటు ఫలితాల విడుదల ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారికంగా విడుదల చేయకుండా కేవలం అభ్యర్థికి నేరుగా సమాచారం అందించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఇందులో కొంతమంది కోచింగ్‌ సెంటర్ల ప్రతినిధుల హస్తం ఉందని డీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. జిల్లాలో సుమారు 5 వేల మంది అర్హులైన నిరుద్యోగుల పరిస్థితి వర్ణణాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకుని, నిరుద్యోగుల అనుమానాలను నివృత్తి చేయాలంటే చంద్రబాబు సర్కార్‌ తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. వారు ఇంకా ఏమన్నారంటే..

నిరుద్యోగులు అల్లాడుతున్నారు

ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు సక్రమమా..అక్రమమా? తేలాలంటే పూర్తిస్థాయి విచారణ జరగాలి. సీబీఐ, సిట్టింగ్‌ జడ్జి స్థాయిలో విచారణ జరిగితే నిజాలు బయటపడతాయి. డీఎస్సీలో త్రుటిలో ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు అవినీతి జరిగిందని తెలిసి అల్లాడిపోతున్నారు. డీఎస్సీలో అవకతవకలకు పాల్పడి, మా కడుపు కొట్టారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. – ప్రవీణ్‌,

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, తిరుపతి

డీఎస్సీ అంతా అవినీతిమయం

మెగా డీఎస్సీ అంతా అవినీతిమయమైంది. తమ అనుచరులకు అధికారపార్టీ నేతలు ఉద్యోగాలను అమ్ముకుని రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. ఎంతో మంది పేద నిరుద్యోగులు ఏళ్ల తరబడి అప్పులు చేసి కోచింగ్‌ తీసుకున్న వారి కడుపు కొట్టారు. ఇంత దారుణం గతంలో ఎన్నడూ చూడలేదు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిలో 90 శాతం మందివి నకిలీ ధ్రువపత్రాలనే అనుమానం ఉంది.

– ప్రేమ్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం

ఎస్వీయూ అధ్యక్షులు

ప్రభుత్వం నిజాయితీని

నిరూపించుకోవాలి

మెగా డీఎస్సీ అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం దారుణం. ప్రభుత్వం నిజాయితీగా, నిక్కచ్చిగా అవినీతికి తావులేకుండా మెగా డీఎస్సీని నిర్వహించి ఉంటే తమ నిజాయితీ ఇదీ..అని ఉద్యోగాల పొందిన వారి మెరిట్‌ లిస్ట్‌ను, వారి ధ్రువపత్రాలను బయటపెట్టాలి. ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు బయటపడి ప్రభు త్వ నిజాయితీ తెలుస్తుంది. స్పోర్ట్స్‌ కోటాతో పాటు మిగిలిన పోస్టుల ఫలితాలపైనా అనుమానాలను నివృత్తి చే యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – శివ బాలాజీ,

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు, తిరుపతి

Advertisement
 
Advertisement
Advertisement