ఏమార్చేశారు! | - | Sakshi
Sakshi News home page

ఏమార్చేశారు!

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

● ఒక్కో సారి ఒక్కో లిస్టు విడుదల ● సాంకేతిక లోపం సాకుతో తెరవెనుక భారీ మాయాజాలం? ● అనర్హులకు కొలువులు...అర్హులకు మొండిచేయి ● కన్నీరు మున్నీరవుతున్న నిరుద్యోగులు

డీఎస్సీ నియామకాల్లో నిలువునా మునిగిన ప్రతిభావంతులు

మెరిట్‌ లేని వారికి ఉద్యోగాలు

కుప్పం మండలానికి చెందిన రాధాకృష్ణ (పేరు మార్చాం) ఐదేళ్లుగా ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. డీఎస్సీ కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలో అధికారిక కీ ప్రకారం అతనికి అత్యుత్తమ మార్కులు వచ్చాయి. విద్యాశాఖ మొదట విడుదల చేసిన సెలెక్షన్‌ లిస్టులో ఎంపికయ్యారు. కుటుంబ సభ్యులు సంబరపడ్డారు. తీరా సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లే సమయానికి, అధికారులు సాంకేతిక కారణాలతో సవరించిన రెండో జాబితాలో రాధాకృష్ణ పేరు లేదు. అతనికంటే 8 మార్కులు తక్కువ వచ్చిన ఓ అభ్యర్థి పేరు ఆ స్థానంలో ప్రత్యక్షమైంది. అధికారులను నిలదీస్తే అది పై నుంచి వచ్చిన ఆర్డర్స్‌ .. మాకేం తెలియదని సమాధానం ఇచ్చారు. ఇక ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు.

మెరిట్‌ లేని వారికి మెగా డీఎస్సీలో ఉద్యోగాలు కల్పించారు. గత ఏడాది ఆగస్టులో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 1,478 మందికి గాను 1,099 మందికి కాల్‌లెటర్లు పంపారు. సర్టిఫికెట్‌లు పూర్తి చేసుకున్న మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదనే మెలిక పెట్టారు. ప్రతిభను నమ్ముకున్న అభ్యర్థులకు అన్యా యం చేశారు. ప్రతిభ కనబరచిన వారు న్యాయం కోసం విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగు తుంటే, కనీస అర్హత మార్కులు (కట్‌ ఆఫ్‌) సాధించని వారు, అసలు మెరిట్‌ జాబితా ఆఖరి పేజీల్లో ఉన్నవారు అనూహ్యంగా నియామకపత్రాలు అందుకోవడం అర్హులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

ఇది ఒక్క కుప్పంలోని రాధాకృష్ణ పరిస్థితే కాదు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత ఏడాది డీఎస్సీ రాసిన నిరుద్యోగుల దుస్థితి. పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించినా ఉద్యోగం సంపాదించలేకపోయారు. కట్‌ ఆఫ్‌ కంటే తక్కువ వచ్చిన వారు అనూహ్యంగా నియామక పత్రాలు అందుకుని ఉద్యోగాల్లో జాయిన్‌ అయ్యారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. డీఎస్సీ గోల్‌మాల్‌ వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని వేలాది మంది అర్హులకు మెగా డీఎస్సీలో అన్యాయం జరిగింది. పారదర్శకతకు నిలువుటద్దంగా నిలవాల్సిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేసింది. అంతర్గత అవకతవకల కారణంగా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి, ఉద్యోగం ఖాయమనుకున్న ప్రతిభావంతుల పేర్లు రాత్రికి రాత్రే మాయం చేశారు. అసలు క్వాలిఫైయింగ్‌ మార్కులు సైతం రాని వారు నియామక పత్రాలతో పాఠశాలల్లో అడుగుపెట్టడం విద్యాశాఖ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మారింది.

ఏ జాబితా ఫైనల్‌?

చంద్రబాబు సర్కారు చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ అక్రమాలకు, అవకతవకలకు నిలువెత్తు నిదర్శనంగా మారింది. విడతల వారీగా మారుతూ వచ్చిన ఫలితాల జాబితా, మెరిట్‌ లిస్ట్‌లు పలు అనుమానాలకు తావిచ్చింది. సాధారణంగా ఏ పరీక్షలైనా అత్యంత పకడ్బందీగా ఒకేసారి తుది మెరిట్‌, సెలెక్షన్‌ లిస్టులను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ మెగా డీఎస్సీలో వింత పోకడలకు తెరలేపారు. అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తూ, అనుమానాలకు తావిచ్చేలా ఒక్కోసారి ఒక్కొక్క రకమైన జాబితాను తెరపైకి తీసుకొచ్చారు. మొదటి సారి విడుదల చేసిన ప్రాథమిక మెరిట్‌ జాబితాలో చాలామంది అభ్యర్థులు టాప్‌ ర్యాంకుల్లో కనిపించారు. ఉద్యోగం ఖాయమని ధీమాగా ఉన్న అభ్యర్థుల పేర్లు.. మరుసటి రోజు వచ్చే సరికి మాయమైపోయాయి. వారి స్థానంలో వెనుకబడిన ర్యాంకర్ల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. ఒకే కేటగిరీ, ఒకే పోస్టుకు సంబంధించి మూడు నుంచి నాలుగు సార్లు సవరించిన జాబితాలను విడుదల చేశారు. ఏ జాబితా ఫైనల్‌? ఏ జాబితా ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నారో తెలియని అయోమయ స్థితిని కల్పించారు.

అసలు మతలబు ఇదే

చంద్రబాబు సర్కారు సృష్టించిన ఈ సాంకేతిక సాకుల వెనుకే అసలు మాయాజాలం దాగి ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కావా లనే మొదట ఒక లిస్ట్‌ వదిలి, అభ్యర్థుల స్పందనను చూసి, ఆ తర్వాత తెరవెనుక జరిగిన చర్చలు, పైరవీల ఆధారంగా లూప్‌ పోల్స్‌ వెతుక్కుంటూ అనర్హులను జాబితాల్లోకి చొప్పించడానికి లిస్టుల మార్పిడి ప్రక్రియను ఆయుధంగా వాడుకున్నట్లు బాధిత డీఎస్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పారదర్శకతను సమాధి చేస్తూ సాగిన జాబితాల మెగా డీఎస్సీ గోల్‌మాల్‌ పై తక్షణమే సీఐడీ విచారణ చేయించాలని బాధితులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

అంతా మా

ఇష్టం

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో చిత్తూరు జిల్లా కేంద్రంగా గత ఏడాది ఆగస్టులో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఒక్కొక్క విడతలో ఒక్కో రకమైన జాబితాను విడుదల చేశారు. బాధిత నిరుద్యోగులు తమకు అన్యాయం జరిగిందని అడిగితే, సాంకేతిక లోపం అంటూ సాకులు చెప్పారు. ఈ సాకులు చెప్పడం వెనుక రూ.వందల కోట్ల అవినీతి జరిగిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పలు రకాల కొత్త పేర్లను సృష్టించి మార్కులను తారుమారు చేయడం, రోస్టర్‌ పాయింట్లను ఇష్టానుసారంగా మార్చేయడం, నకిలీ స్పోర్ట్స్‌, పీహెచ్‌ సర్టిఫికెట్లు సమర్పించడం వల్ల అర్హులైన నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగినట్టు స్పష్టమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement