– టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఆగ్రహం
తిరుపతి మంగళం: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్లుగా తిరుమల శ్రీవారి పవిత్రతను దిగజారుస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు శ్రీవారి లడ్డూ ప్రసాదంతో కూడా రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్లలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆయన మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రోజుకు ఏడు వేలకు పైగా వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను విక్రయిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఆన్‌లైన్‌లో పెట్టిన దర్శనాల టికెట్లు సెకన్లలో అయిపోయినట్లు చూపించి వాటిని రూ.లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. ఎస్వీ భక్తి చానల్, దళిత గోవిందం, శ్రీనివాస కల్యాణం, వేల సంఖ్యలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. ఐదేళ్ల జగనన్న పాలనలో వీఐపీ దర్శనాలకు కాకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేసినట్టు చెప్పారు. అప్పట్లో రోజుకు మూడు వేల లోపే వీఐపీ దర్శనాలు కల్పించేవాళ్లమని, ఇప్పుడు ఏడు వేలకు పైగా వీఐపీ దర్శన టికెట్లను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైన టీటీడీ పాలక మండలిని, ఉన్నతాధికారులను రోజూ సామాన్య భక్తులు దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీరంగనీతులని, చేసేవన్నీ నీచమైన పనులేనని ఆయన విమర్శించారు.
పనుల్లో పురోగతి చూపండి
తిరుపతి అర్బన్: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో అధికారులు పురోగమనం చూపాల్సి ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ, రెవెన్యూ సమస్యలు, పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీలు, రీసర్వే పనులు, 22ఏ నిషేధిత జాబితాలోని కేసుల పరిష్కారం, మాన్యువల్ రికార్డ్స్‌ను డిజిటలీకరణ, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అన్ని అంశాల్లోను ఎప్పటికప్పుడు పురోగతి చూపాలన్నారు.


