నియామక పత్రాల పంపిణీలో అధికార దుర్వినియోగం | - | Sakshi
Sakshi News home page

నియామక పత్రాల పంపిణీలో అధికార దుర్వినియోగం

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

● సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నేతల అత్యుత్సాహం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అధికారులు పారదర్శకంగా పంపిణీ చేయాల్సిన అంగన్‌వాడీ పోస్టుల నియామక పత్రాలను ఏకంగా టీడీపీ నాయకులు పంచిపెడుతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సామాజిక మాధ్యమాల్లో ఈ ఘనతను టీడీపీ మద్దతుదారులు ప్రచారం చేసుకుంటుండగా, వాటిని ఖండిస్తూ నియోజకవర్గ ప్రజలు, విద్యావంతులు, మేధావుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్యవేడు ఐసీడీఎస్‌ పరిధిలో 31 అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు అభ్యర్థులను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. నియమితులైన వారికి నియోజకవర్గ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ ఆధ్వర్యంలో నియామక పత్రాలు పారదర్శకంగా పంపిణీ చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. అయితే టీడీపీ నాగలాపురం మండల అధ్యక్షుడు టీజేబీ ప్రణీత్‌ రెడ్డి తన కార్యాలయానికి పిలిపించుకుని, నియామక పత్రాలను అందజేయడం, వారిని సత్కరిస్తూ పార్టీకి పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించిన విషయాలను వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తిగా సంబంధిత శాఖ అధికారులు, ఐసీడీఎస్‌ సిబ్బంది నిర్వహించాలి కానీ ఇక్కడ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు నేరుగా జోక్యం చేసుకున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌, ఐసీడీఎస్‌ పీడీ తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement