జనమే ప్రధానం.. | - | Sakshi
Sakshi News home page

జనమే ప్రధానం..

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

మంచి చేసినందుకు శిక్షిస్తామంటే

సంతోషమే

విచారణ న్యాయబద్ధంగా జరగాలని కోరుతున్నాం

తుడా నిధులు ఎంపీడీఓలకు

చట్టబద్ధంగానే బదిలీ చేశారు

మాపై కక్షతో ప్రభుత్వ అధికారులను వేధించొద్దు

‘ఏసీబీ విచారణ – సమగ్ర వివరణ’ బుక్‌లెట్‌ విడుదల

మీడియా సమావేశంలో

చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

‘ప్రజల కోసం పోరాటం చేయడంలో ముందుంటాం. నా తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని 230 రోజులు జైలులో పెట్టారు. నాపైన, నా కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెడుతున్నారు. అభివృద్ధి చేసినా అవినీతి అంటూ విషప్రచారం చేస్తున్నారు. కావాలనే కక్షగట్టి రోజూ విషబీజాలు నాటుతున్నారు. అయినా మేం భయపడం. ప్రజల కోసం పోరాటం ఆపం. జనమే మాకు ప్రధానం.. వంద సార్లు జైలుకు వెళ్లడానికి కూడా మేం సిద్ధం..’ అని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. తుడాలో ఏసీబీ అధికారుల విచారణ నేపథ్యంలో ఆయన ‘ఏసీబీ విచారణ..సమగ్ర వివరణ’ పేరుతో ఓ బుక్‌లెట్‌ను విడుదల చేశారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తుడా మాజీ చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి

తిరుపతి రూరల్‌: తుడాలో అవినీతి జరిగిందంటూ సాగుతున్న ప్రచారానికి తుడా మాజీ చైర్మన్‌, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తుడా నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసినందుకు జైలుకు పంపుతామంటే తాము సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తిరుపతి రూరల్‌ మండలం, తుమ్మలగుంట గ్రామంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 2019లో తుడా చైర్మన్‌గా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి రూ.29 కోట్ల బడ్జెట్‌ ఉన్న తుడాను 2024లో తాను తుడా చైర్మన్‌గా దిగే సమయానికి రూ.400 కోట్లకు పెంచినట్టు గుర్తుచేశారు. గత ఐదేళ్ల జగనన్న పాలనలో తుడా అభివృద్ధిని చూసి ఓర్వలేకే అవినీతి బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ఏసీబీ, విజిలెన్స్‌ విచారణను గౌరవించి ఇన్నాళ్లు తాము మౌనం పాటించామని, కానీ అసత్య ప్రచారం హద్దులు దాటుతుంటే వాస్తవాలు ప్రజలకు చెప్పక తప్పలేదన్నారు. తుడాలో జరిగిన ప్రతి పనికీ, ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్కలు ఉన్నాయని, చెవిరెడ్డి కుటుంబానికి అవినీతి మరకలు అంటించేందుకు అధికారులను బలిచేయొద్దని విజ్ఞప్తి చేశారు.

బుక్‌లెట్‌ విడుదల

2019 నుంచి 2024 వరకు తుడా పరిధిలో చేపట్టిన అభివృద్ధికి సంబంధించి పూర్తి వివరాలతో ‘తుడాపై ఏసీబీ విచారణ – సమగ్ర వివరణ’ పేరుతో మోహిత్‌రెడ్డి బుక్‌లెట్‌ విడుదల చేశారు. అందులో ప్రతి ఆరోపణకు ఆధారాలతో సమాధానం ఇచ్చామని చెప్పారు. బుక్‌లెట్‌లోని ఒక్క అంశమైనా తప్పని నిరూపిస్తే పూర్తి బాధ్యత వహించడానికి తాము సిద్ధమన్నారు.

చట్టబద్ధంగానే బదలాయింపు

తుడా నుంచి రూ.220కోట్లు అక్రమంగా ఎంపీడీఓల ఖాతాలకు దారిమళ్లించారని చేస్తున్న ఆరోపణలపై స్పందించిన మోహిత్‌రెడ్డి అదంతా చట్టబద్ధంగానే జరిగిందన్నారు. కలెక్టర్‌ అనుమతి, తుడా వీసీ అంగీకారంతోనే ఎంపీడీఓల ఖాతాలకు నిధులు మళ్లించారని చెప్పారు. ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టిన దాఖలాలు లేవన్నారు.

అధికారులను వేధించొద్దు

తమపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా తుడా కేంద్రంగా జరిపే విజిలెన్స్‌ విచారణలో ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించడం సరికాదన్నారు. ఏవైనా ప్రశ్నలు ఉంటే తమను నేరుగా నిలదీయాలని సూచించారు. తుడాలో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాధించలేదన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, చంద్రగిరి ఎంపీపీ హేమేంద్ర కుమార్‌రెడ్డి, చంద్రగిరి మండల పార్టీ అధ్యక్షుడు కొటలా చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రగిరి మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మస్తాన్‌, పేరూరు మాజీ సర్పంచ్‌ దామినేటి కేశవులు, పార్టీ నాయకులు హరిప్రసాద్‌ రెడ్డి, కరమలవల్లీ, యశ్వంత్‌రెడ్డి, రాజేష్‌, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేస్తే.. అవినీతి అంటారా?

తుడా పరిధిలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే అవినీతి జరిగిందని అంటున్నారని, తుడా ఆదాయం, ఆస్తులు పెరగడం, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం కూడా అవినీతేనా..?అని మోహిత్‌ ప్రశ్నించారు. సూరప్పకసం, అవిలాల, తుడా టవర్స్‌, పార్కుల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందే జరిగాయని గుర్తుచేశారు. తుడా ఒక్కో సిమెంట్‌ బెంచ్‌కి రూ.9 వేల వరకు ఖర్చు చేస్తే, గతంలో చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాలు, వైజాగ్‌ వద్దనున్న చోడవరం పార్కులో ఒక్కో బెంచ్‌కి రూ.14 వేల వరకు ఖర్చు చేశారని గుర్తుచేశారు. దీనిని బట్టి అవినీతి ఎక్కడ జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు.

నాని ఆరోపణలపై ఆగ్రహం

తుడాలో అవినీతి జరిగిందంటూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తన పేటీఎం బ్యాచ్‌తో చేయిస్తున్న ఆరోపణలపై మోహిత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో కర్మక్రియల భవనాలు, ధ్యాన మందిరాలు, కల్యాణ మండపాలు, సిమెంటు రోడ్లు, మురుగు కాలువలు, అండర్‌ డ్రైనేజీ, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు, మెడికల్‌ క్యాంపులు, ప్రతి ఇంటికీ పండ్లు, పూల చెట్లు, పార్కులు వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

అభివృద్ధి చేసినందుకు జైలుకు పంపుతామంటే సిద్ధమే

Advertisement
 
Advertisement
Advertisement