శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని సమాచారాశాఖ కమిషనర్ గాజుల ఆదెన్న కుటుంబ సమేతంగా ఆదివారం సేవించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఈఓ బీకే వెంకటేశులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు.
కదులుతున్న బస్సు దిగబోయి..
– విద్యార్థిని పాదం నుజ్జునుజ్జు
వరదయ్యపాళెం: వరదయ్యపాళెం ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న బస్సు నుంచి దిగే ప్రయత్నంలో 16 ఏళ్ల విద్యార్థిని పాదం మీదుగా బస్సు వెనుక టైరు వెళ్లడంతో పాదం నుజ్జునుజ్జు అయ్యింది. బాధిత యువతి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. పాండూరు గ్రామానికి చెందిన హారిక సూళ్లూరుపేట వెళ్లేందుకు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు బయలుదేరుతుండగా హారిక తల్లి హడావుడిగా దిగేయడంతో, తల్లి వెంట తానూ దిగేందుకు హారిక ప్రయత్నించింది. ఈ క్రమంలో కాలు జారి బస్సు కింద పడిపోవడంతో వెనుక టైరు ఆమె కుడి కాలి పాదం పైనుంచి వెళ్లింది. పాదం తీవ్రంగా దెబ్బతిని రక్తస్రావమైంది. వెంటనే బస్సును ఆపి 108 అంబులెన్స్ ద్వారా శ్రీకాళహస్తికి తరలించి వైద్యం చేయించారు. విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.
ఆగిన నారాయణాద్రి
రేణిగుంట: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి రేణిగుంట వద్ద నిలిచిపోయింది. ఏమి జరిగిందో తెలియక ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. స్థానికుల కథనం.. తిరుపతి నుంచి సాయంత్రం 6.20 నిమిషాలకు బయలుదేరిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు రేణిగుంట వారపు సంత రైల్వే గేట్ సమీపంలో నిలిచిపోయింది. గంట పాటు చీకటిలో రైలు నిలిచిపోవడంతో ఏమి జరిగిందో తెలియక ప్రయాణికులు కొంత భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత యథావిధిగా రైలు బయలుదేరి వెళ్లింది. రైల్లోని కో పైలట్‌ను అడగ్గా ట్రైన్‌కి పవర్ కట్ అవడం వల్ల రైలును ఆపేశామని తెలిపారు.
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 1న సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ కార్యాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
అయ్యో ‘పాప’ం
– టిన్నర్ తాగి మూడేళ్ల చిన్నారి మృతి
దొరవారిసత్రం : తాగునీరు అనుకుని పెయింట్‌లో కలిపే టిన్నర్ తాగి మూడేళ్ల చిన్నారి దీప్తి మృతి చెందిన ఘటన బూదూరులో ఆదివారం జరిగింది. వివరాలు.. బూదూరు ఎస్సీ కాలనీకి చెందిన పైపూరి మోహన్‌కుమార్, నవీన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె దీప్తి ఇంట్లో పొయ్యి వెలిగించేందుకు తీసుకువచ్చిన టిన్నర్‌ను తాగేసింది. గుర్తించి తల్లిదండ్రులు వెంటనే బైక్‌పై సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వైవీ చౌదరి ఘటన స్థలం పరిశీలించారు. దర్యాప్తు చేపట్టారు.
సద్వినియోగం చేసుకోండి
తిరుపతి సిటీ:ఎస్వీయూ పరిధిలో ఇయర్లీ ప్యాట ర్న్ విధానంలో యూజీ పూర్తి చేసి ప్రాక్టికల్స్ పెండింగ్‌లో ఉన్న విద్యార్థులకు సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు డీన్ సురేంద్రబాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజమాణిక్యం తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే ప్రాక్టికల్స్‌కు విద్యార్థులు హాజరుకావాలని సూచించారు.


