తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజున తిరుమల తరహాలో గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు ఆదివారం రాత్రి పౌర్ణమి గడియల్లో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారు మలయప్ప స్వామి అలంకరణలో గరుడునిపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. పౌర్ణమి గరుడ సేవ తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీ దంపతులు, వారి తనయులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు.


