రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ మునస్వామి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ మునస్వామి మృతి

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

సూళ్లూరుపేట:తిరుపతి స్విమ్స్‌ లో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కారణి మునస్వామి ఆదివారం ఉదయం రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. తడ మండలం మాంబట్టు శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించేందుకు ఆయన వస్తుండగా టాటా రియర్సన్‌ కంపెనీ సమీపంలో కారు వెనుక టైర్‌ పగలడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. కారులో అన్ని బెలూన్లు ఓపెన్‌ అయినప్పటికీ ఆయనకు ముప్పు తప్పలేదు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్‌ఐ కొండపనాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రముఖుల నివాళి

తిరుపతి స్విమ్స్‌ వైద్యుడు మునస్వామి మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ వరప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, తిరుపతి రోటరీ క్లబ్‌ మాజీ గవర్నర్‌ సమ్మన సోమ్‌ప్రకాష్‌యాదవ్‌, తుడా ప్రత్యేక అధికారి బాబయ్య, బీజేపీ నేతలు సైకం జయచంద్రారెడ్డి, రెడ్డీశ్వరరెడ్డి, స్విమ్స్‌, రుయా, బర్డ్‌, పద్మావతి మెడికల్‌ కళాశాల డాక్టర్లు, ప్రొఫెసర్లు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

Advertisement
 
Advertisement
Advertisement