తస్మాత్‌ జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

తస్మాత్‌ జాగ్రత్త

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

● ఓట్ల పరిరక్షణలో బీఎల్‌ఏలదే కీలక పాత్ర ● ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అప్రమత్తత అవసరం ● బూత్‌ లెవల్‌ ఏజెంట్ల అవగాహన సదస్సులో భూమన

‘‘ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలి.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలి.. వైఎస్సార్‌సీపీ అనుకూల ఓట్ల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేయాలి.. కూటమి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి.. అర్హులైన ఒక్క ఓటరుకు కూడా అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏమాత్రం ఏమరుపాటుకు గురికాకుండా బాధ్యతాయుతంగా ముందడుగు వేయాలి’’ అని పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాళహస్తిలో నిర్వహించిన అవగాహన సదస్సులో బూత్‌లెవల్‌ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.

శ్రీకాళహస్తి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కీలక పాత్ర పోషించాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన బీఎల్‌ఏల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భూమన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అర్హులైన వారి పేర్లు తొలగిపోకుండా, కొత్తగా అర్హత పొందిన వారందరి పేర్లు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద మార్పులు గానీ, నిబంధనలకు విరుద్ధంగా ఓట్ల తొలగింపునకు యత్నిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. రాబోయే నెలరోజులు బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు.

ఎత్తుగడలను తిప్పికొట్టాలి

మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి మార్పును నిశితంగా పరిశీలించాలన్నారు. బీఎల్‌ఏల అప్రమత్తతే పార్టీకి ప్రధాన బలమని స్పష్టం చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించేందుకు యత్నిస్తే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసి అడ్డుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు, బీఎల్‌ఏలు ధైర్యంగా ముందుకు సాగాలని, ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సమయస్ఫూర్తితో పనిచేస్తూ ఓటర్ల ధ్రువీకరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సమన్వయ చేసుకోవాలి

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఓట్లను కాపాడుతామంటున్న నేతలు, బీఎల్‌ఏలు

సమష్టిగా పనిచేయాలి

ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కారణంగా అనేక రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు జరిగాయని తెలిపారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని కోరారు. శ్రీకాళహస్తి ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, సిద్ధ గుంట సుధాకర్‌ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సంధ్యారాణి, ఎంపీపీ హరిప్రసాద్‌ రెడ్డి, బర్రె సుదర్శన్‌ రెడ్డి, చెవిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి, కూనాటి రమణయ్య యాదవ్‌, కొగిలి సుబ్రమణ్యం, గంగారి రమేష్‌, సిరాజ్‌ బాషా, ఉత్తరాజి శరవణ కుమార్‌, చంద్రయ్య నాయుడు, కంఠా ఉదయ్‌కుమార్‌, పఠాన్‌ ఫరీద్‌, గోరా, శ్రీవారి సురేష్‌, బతి శెట్టి, కోలూరు హరినాయుడు, ప్రభాకర్‌, నాగేష్‌, నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement