కట్టుదిట్టంగా ఓటుకు కాపలా | - | Sakshi
Sakshi News home page

కట్టుదిట్టంగా ఓటుకు కాపలా

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

● ఓట్ల రక్షణలో బూత్‌లెవల్‌ ఏజెంట్లే కీలకం : భూమన ● అప్రమత్తతే మన ఆయుధం : మోహిత్‌రెడ్డి ● బీఎల్‌ఏలకు వివరిస్తూ.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏలకు అవగాహన

‘‘ఓట్ల రక్షణే లక్ష్యంగా కృషి చేయాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించాలి. వైఎస్సార్‌సీపీ అనుకూల ఓటర్లకు అండగా నిలవాలి. ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కూటమి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు మన వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించాలి’’ అని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ బూత్‌లెవల్‌ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.

తిరుపతి రూరల్‌ : చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ ముక్కోటి ఆలయం వద్ద నారాయణి గార్డెన్స్‌ కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై అవగాహన కల్పించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప హాజరయ్యారు. అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పరిశీలకులుగా వజ్ర భాస్కర్‌రెడ్డి, భరత్‌ పాల్గొన్నారు.

బాధ్యత బీఎల్‌ఏలదే..

చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అనుకూలమైన ప్రతి ఓటును కాపాడే బాధ్యత బీఎల్‌ఏలదేనని, ఓటు పరిరక్షణలో వారి పాత్ర కీలకమని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా, కొత్తగా అర్హత పొందిన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. నిర్లక్ష్యానికి తావులేకుండా బీఎల్‌ఓలతో పాటు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించారు.

ఎత్తుగడలను అడ్డుకోవాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ఎత్తుగడలను అడ్డుకోవాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి మార్పును నిశితంగా పరిశీలించాలని, బీఎల్‌ఏల అప్రమత్తతే పార్టీకి ప్రధాన ఆయుధమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓట్ల తొలగింపునకు యత్నిస్తే వెంటనే అభ్యంతరం తెలపాలని సూచించారు. చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 3.09 లక్షల ఓటర్లు ఉండగా, అందులో సుమారు 1.30 లక్షల మందికి ఓటు వెరిఫికేషన్‌ జరగాల్సి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో ప్రతి బీఎల్‌ఏ తనకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

సమష్టిగా పనిచేయాలి

పరిశీలకులు వజ్ర భాస్కర్‌రెడ్డి, భరత్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా పెద్దసంఖ్యలో ఓట్లు తొలగించడంతో పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో ముఖ్యమంత్రులే ఓడిపోయారన్నారు. ఈ క్రమంలో బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేస్తూ అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియలో బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసి ప్రతి ఓటరును చేరుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement