తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ రిజర్వు ఇన్‌స్పెక్టర్ సాయి గిరిధర్‌కు డీఎస్పీగా ఉద్యోగోన్నతి లభించింది. శనివారం ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ హెడ్, ఎస్పీ సుబ్బరాయుడును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఈ క్రమంలోనే టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, ఏఎస్పీ కులశేఖర్‌ను కూడా కలిశారు.
రైల్వే సీపీఆర్‌ఓగా బాలాజీ కిరణ్
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్‌ఓగా ఐఆర్‌టీఎస్ అధికారి వై.బాలాజీ కిరణ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. నాయుడుపేటకు చెందిన బాలాజీ కిరణ్‌కు విస్తృత పరిపాలనా అనుభవం, వృత్తి నైపుణ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ సామర్థ్యం ఉందని, ఈ క్రమంలో మీడియా అనుసంధానం, రైల్వేతో ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా బాలాజీకిరణ్‌కు రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ అభినందనలు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 78,389 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 45,283 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.


