కలెక్టరైతే నాకేంటి..! | - | Sakshi
Sakshi News home page

కలెక్టరైతే నాకేంటి..!

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

● తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిపై లైంగిక ఆరోపణలు ● విచారణ నేపథ్యంలో విధుల నుంచి తప్పించిన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ● లెక్క చేయకుండా పెత్తనం చెలాయిస్తున్న కార్యదర్శి మణి

ఒక పంచాయతీ కార్యదర్శి.. ఏకంగా కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేసేస్తున్నాడు. విధుల నుంచి తప్పించినప్పటికీ ఏం ఎరగనట్టు కార్యాలయానికి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నాడు. వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ సాగుతున్నప్పటికీ తనకేం పట్టనట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితులను భయపెట్టేందుకే సదరు కార్యదర్శి హల్‌చల్‌ చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. విచారణ కమిటీ ఎదుట ఎవరూ నోరెత్తకుండా బెదిరించేందుకు యత్నిస్తున్నాడని మండిపడుతున్నారు.

చంద్రగిరి : తిరుచానూరు పంచాయతీ కార్యదర్శి మణిపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో విధుల నుంచి తప్పిస్తూ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఈ మేరకు ఇన్‌చార్జి కార్యదర్శిగా తిరుపతి రూరల్‌ ఈఓపీఆర్‌డీ దయాసాగర్‌ను సైతం నియమించారు. అలాగే మణిపై విచారణ నిమిత్తం ఎర్రావారిపాళెం డిప్యూటీ ఎంపీడీఓ పద్మారాణి, శ్రీకాళహస్తి డీడీఓ సుస్మిత, తిరుపతి డీడీఓ గంగా భవానీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం ఈ మేరకు ప్రత్యేక కమిటీ విచారణ సైతం చేపట్టింది.

ఒక్కొక్కరినీ పిలిపించి..

తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక కమిటీ విచారణలో భాగంగా సిబ్బందితో మాట్లాడారు. పనిచేస్తున్న వారితో పాటు గతంలో కార్యదర్శి మణి విధుల నుంచి తప్పించిన సిబ్బందిని సైతం పిలిపించి విచారణ చేపట్టారు. కార్యదర్శి మణి వ్యవహార శైలి, మహిళలతో ఆయన వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు సంబంధించిన పలు ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. సిబ్బంది తెలిపిన వివరాలను అధికారులను నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా పంచాయతీ కార్యదర్శి మణిని సైతం అధికారులను విచారించారు. తుది నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని వివరణ ఇచ్చారు.

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో విధుల నుంచి తప్పిస్తూ కలెక్టర్‌ జారీ చేసిన ఆదేశాలను పంచాయతీ ఈఓ మణి బేఖాతరు చేయడం చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడు సచివాలయానికి మణి రావడంతో ఉద్యోగులు అవాక్కయ్యారు. ఆపై ఉద్యోగుల సమాచారం, పారిశుద్ధ్య కార్మికులకు విధుల కేటాయింపులను సదరు కార్యదర్శి మణి చేపట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్‌ ఆదేశాలంటే లెక్కలేదా అంటూ తోటి ఉద్యోగులు సైతం మండిపడుతున్నారు. లైంగిక వేధింపులే కాకుండా పంచాయతీలో భారీగా మణి అవినీతికి పాల్పడినట్లుగా పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement