తిరుపతి రూరల్ : ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశించారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెలిపారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. . విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసరుగా నియమించినట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్, విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. సర్కిళ్లు, డివిజన్ల స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారులు,సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ప్రజలు సైతం వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలను తాకవద్దని, లైన్ల కింద నిలబడవద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపడడం వంటి ఘటనలను గుర్తిస్తే వెంటనే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.


