నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నిందితుడి అరెస్ట్‌

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

సత్యవేడు: సత్యవేడు, నాగలాపురం, మాదరపాకం (తమిళనాడు) పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న మదనంబేడుకు చెందిన గోవర్ధన్‌రెడ్డి(23)ని సత్యవేడు పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సాయినాథ్‌చౌదరి, ఎస్‌ఐ లావణ్య ఆధ్వర్యంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్‌ఐ కథనం.. మండలంలోని కాళమనాయుడుపేట పంచాయతీ పరిధిలోని గాంధీపురానికి చెందిన హిమయవర్మ ఇంట్లో మే 17న పగటిపూట చోరీ జరిగింది. దీనిపై మే 18న ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. సీఐ మురళీనాయుడు సూచనల మేరకు దర్యాప్తు చేపట్టారు. సత్యవేడు గాంధీరోడ్డు మార్గంలోని మాదరపాకం చెక్‌ పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా సత్యవేడు, నాగలాపురం, మాదరపాకం(తమిళనాడు)లో తనే చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద ఉన్న 20 గ్రాముల బంగారం, వెండి 30 గ్రాములు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సూమారు రూ.4.5 లక్షలు ఉంటుందన్నారు. శ్రీసిటీ, మదనంబేడు, వీఆర్‌ కండ్రిగ, పాదిర్వేడులో చోరీకి సంబంధించి గత ఏడాది నిందితుడు జైలుకు వెళ్లి వచ్చాడు. మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటైన నిందితుడు పలు కేసుల్లో పట్టు బడి జెలుకెళ్లడం, బయటకు వచ్చాక చోరీలకు పాల్పడడం అలవాటు చేసుకున్నాడు. నిందితుడిపై పీడీ యాక్ట్‌ అమలు చేయడానికి చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

నాయుడుపేట టౌన్‌: నాయుడుపేటలోని రాజగోపాలపురం రెండవ వీధిలో నివాసం ఉంటున్న కారణి ప్రసాద్‌(29) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. ప్రసాద్‌ తల్లి చంద్రమ్మతో కలిసి రాజగోపాలపురంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. చంద్రమ్మ ఈ నెల 25న సొంత పనుల మీద నెల్లూరుకు వెళ్లారు. ఇంట్లో ప్రసాద్‌ ఒక్కడే ఉంటున్నాడు. ప్రసాద్‌ కోసం అతని స్నేహితుడు పలుమార్లు ఫోన్‌ చేసినప్పటికీ స్పందించక పోవడంతో ప్రసాద్‌ తల్లి చంద్రమ్మకు సమాచారం అందించారు. ఆమె రాజగోపాలపురం వద్ద ఉన్న ఇంటి వద్దకు వెళ్లి చూడాలని స్నేహితులను కోరింది. ఈ క్రమంలో శుక్రవారం ప్రసాద్‌ స్నేహితుడు ఇంటికి వెళ్లి చూడగా ప్రసాద్‌ ఇంట్లో మంచంపై మృతిచెంది పడి ఉండటాన్ని గుర్తించారు. తల్లి చంద్రమ్మతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శివశంకర్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రసాద్‌ మృతదేహం బాగా కలిమిపోయి నల్లగా మారి ఉండడంతో మృతిచెంది రెండు రోజులు అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం సమీపంలోనే మద్యం సీసాలు పడి ఉండడాన్ని గుర్తించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement