అవినీతి ఉపాధి! | - | Sakshi
Sakshi News home page

అవినీతి ఉపాధి!

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

వెంకటరామరాజుపేటలో సీనియర్‌ మేట్లదే పెత్తనం

ఉపాధి సిబ్బంది చేతి వాటం

నాటని రోజా చెట్లకు బిల్లులు

కలువాయి(సైదాపురం): వెంకటగిరి నియోజకవర్గంలో ఉపాధి పథకం అవినీతిమయంగా మారింది. నియోజకవర్గ పరిధిలోని కలువాయి మండలంలో అర్హత కలిగిన నిరుపేద కూలీలకు కాకుండా ప్రస్తుతం సనిచేస్తున్న సీనియర్‌, జూనియర్‌ మేట్లదే పెత్తనం సాగుతోంది. తమ కుటుంబ సభ్యుల పేర్లుపై సపరేటుగా ఫేస్‌ అటెండెట్స్‌ తీసుకుని బినామీ మస్టర్లు వేసి నిధులు దిగమింగుతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మండలంలోని చింతలపాళెం పంచాయతీ, మజరా గ్రామమైన వెంకటరామరాజుపేట గ్రామంలో సీనియర్‌ మేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులు, బంధువులకు సపరేట్‌గా మస్టర్లు వేసి పని చేసినట్లుగా చూపిస్తున్నారని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. అలాగే ఆ మేట్‌ కుమారుడు బీటెక్‌ చదువుకుంటున్నా మస్టర్లో పేర్లు నమోదు చేయడం కొసమెరుపు.

గతంలో నాటిన మొక్కలకు నేడు బిల్లులు

నిమ్మ, మామిడి తోటల అభివృద్ధిలో భాగంగా రైతుల కు ఉపాధి హామీ పథకం ద్వారా చెట్లు నాటేందుకు గుంతలు తీసినప్పటి నుంచి మూడేళ్ల పాటు వాటి సంరక్షణకు నిధులను మంజూరు చేస్తున్నారు. దీన్ని అసరాగా చేసుకుని ఉపాధి సిబ్బంది మరో చేతివాటం ప్రదర్శించారు. వెంకటరామరాజుపేట గ్రామానికి చెందిన జాబ్‌కార్డు 20087 పొట్టపల్లి చెంచయ్య వర్క్‌ ఐడీ 02090220010–ఐఎఫ్‌–జిఐఎస్‌–1078645, మరో జాబ్‌కార్డు నంబర్‌ 20085 పొట్టపల్లి యానాదయ్య వర్క్‌ ఐడీ 02090220010 –ఐఎఫ్‌–జిఐఎస్‌–10786 52 మూడేళ్ల క్రితం నాటిన నిమ్మ మొక్కలకు ఈ ఏడాది నాటినట్టు చూపి బిల్లులు మంజూరు చేశారు.

భయమే లేదు

గతంలో కలువాయి మండలంలో పనిచేసిన ఇద్దరు టీఏలు, ఈసీ, కంప్యూటర్‌ అపరేటర్లు అవినీతి పాల్పడి టెర్మినేషన్‌ కూడా అయ్యారు. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది ఏమాత్రం భయపడకుండా ఆడిట్‌ అధికారులను సైతం మేనేజ్‌ చేస్తూ అవినీతికి అందలం వేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

మూడేళ్ల క్రితం నాటిన

నిమ్మ చెట్లు ఇవే

రోజా మొక్కలకు కూడా బిల్లులు

కలువాయి మండలంలో రోజా మొక్కలు నాటిన వారికి కూడా బిల్లులు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెంకటరామరాజుపేటలో విరివిరు చిన్నమ్మ జాబ్‌కార్డు నం.20126 ఫోర్లి కల్చర్‌ పేరిట వర్క్‌ ఐడీ నం.0209022010–ఐఎఫ్‌–19187012063272 రోజా మొక్కలు నాటినట్లు చూపి మెటీరియల్‌ పేమెంట్‌ కింద గత ఫిబ్రవరి 9వ తేదీన రూ.60 వేలు కలువాయి ఎంసీసీలో నమోదు చేశారు. అసలు రోజా మొక్కలు అక్కడ నాటకనే బిల్లులు దిగమింగారు.

వెంకటగిరి నియోజకవర్గంలో వెలుగు చూస్తున్న అక్రమాలు

Advertisement
 
Advertisement
Advertisement