వెంటాడిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

వెంటాడిన మృత్యువు

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

● నాలుగేళ్ల చిన్నారి మృతి ● మరో ఇద్దరికి గాయాలు

కారును ఢీకొట్టిన ట్రాలీ లారీ

పెళ్లకూరు: తిరుమల దైవదర్శన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కారులో స్వగ్రామానికి బయల్దేరారు. చిన్నారితో కబ్లు చెప్పుకుంటూ..ఆనందంగా ముందుకు సాగుతున్నారు. కానీ మృత్యువు ట్రాలీ లారీ రూపంలో వారిని వెంటాడింది. కారును ఢీకొట్టడంతో ఒక్కసారిగా భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికే కారులోని వారు రక్తపు మడుగులోకి జారుకునేశారు. చిన్నారి వాహనంలోనే చిక్కుకుపోయి మృత్యుఒడికి చేరింది. ఈ విషాద ఘటన బుధవారం అర్ధరాత్రి పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామ ఫ్లైఓవర్‌పై చోటు చేసుకుంది. పోలీసులు స్థానికుల కథనం.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, బోగోలు మండలం, జువ్వలదిన్నె గ్రామానికి చెందిన రాజు శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని అదే రోజు అర్ధరాత్రి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో చిల్లకూరు గ్రామం ఫ్లై ఓవర్‌ వద్ద బెంగళూరు నుంచి నెల్లూరు వైపు ట్రైన్‌వీల్స్‌ లోడ్డుతో వెళుతున్న ట్రాలీ లారీ ముందు వెళుతున్న కారుని అధిగమించే క్రమయంలో అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జస్వి(4) తీవ్ర గాయాలతో కారులోనే మృతి చెందింది. రాజు శ్రీనివాసరెడ్డి మోకాలు, చేతులకు రక్త గాయాలయ్యాయి.

నరకయాతన

నక్కా సుమిజోసెఫ్‌కు కాలు విరిగిపోయింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుగా మారడంతో చిన్నారితో సహా క్షతగాత్రులు కారులోనే ఇరుక్కుపోయారు. కాపాడండంటూ కేకలు వేస్తూ ఆర్థనాదాలు మిన్నంటించారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి అతి కష్టం మీద చిన్నారి మృతదేహంతోపాటు క్షతగాత్రులను వెలికితీశారు. ఆ పై చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రాలీలారీ డ్రైవర్‌ ఉపేంద్రను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement