తిరుపతి తుడా: పేద రోగులకు టీటీడీ ప్రాణదాన పథకం కింద స్విమ్స్‌లో ఉచిత శస్త్ర చికిత్సల కోసం 168 మంది రోగులను ఎంపిక చేసినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. గురువారం స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయ కమిటీ హాల్‌లో స్విమ్స్ డైరెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎంపిక ప్రక్రియలో శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్‌ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, బర్డ్ హాస్పిటల్ డాక్టర్ రామ్మూర్తి, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, రుయా హాస్పిటల్ డాక్టర్ సుబ్బలక్ష్మి, మెటర్నటీ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసులు, వైధ్యాధికారులు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. అర్హతలను బట్టి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడానికి వివిధ విభాగాల కింద 168మంది రోగులను ఎంపిక చేసినట్లు డైరెక్టర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఉపాధి కూలీ మృతి
పుల్లంపేట: రోడ్డు ప్రమాదంలో ఉపాధి కూలీ మృతిచెందిన ఘటన మండల పరిధిలోని రెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని రెడ్డిపల్లె దళితవాడకు చెందిన తుమ్ములూరు లక్ష్మీనరసమ్మ గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఉపాధి హామీ పనుల నిమిత్తం రెడ్డిపల్లె చెరువుకట్ట సమీపంలో వెళ్తున్నారు. అదే సమయంలో రైల్వేకోడూరు నుంచి కడప వైపు వెళుతున్న ఎంహెచ్ 43కె 6352 నంబరు గల లారీ వేగంగా ఆమెను ఢీకొట్టింది. దీంతో లక్ష్మీనరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు.


