తిరుపతి రూరల్: బలమైన గాలీవాన కురిసే సందర్భాల్లో విద్యుత్ ప్రమాదాల భారిన పడకుండా వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి గురువారం ఒక ప్రకటనలో కోరారు. బలమైన గాలుల కారణంగా సంస్థ పరిధిలో అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్తు లైన్లు తెగి పోవడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయన్నారు. ఇటువంటివి జరిగిన సందర్భాల్లో వినియోగదారులు తెగిపడిన విద్యుత్ తీగలను తాకకుండా దూరంగా ఉండాలన్నారు. ఇంట్లో కూడా విద్యుత్ పరికరాలకు సంబంధించిన వైర్లను తాకవద్దన్నారు. విద్యుత్ తీగల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరగా నిలబడవద్దని సూచించారు. తమ ప్రాంతంలో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపోవడం లాంటి సంఘటనలను గుర్తించినట్లయితే వినియోగదారులు వెంటనే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ బిల్లుపై ముద్రించబడిన తమ ప్రాంత అసిస్టెంట్ ఇంజినీర్ మొబైల్ నంబరుకు గానీ లేదా విద్యుత్ శాఖ టోల్–ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారాన్ని తెలియజేయవచ్చన్నారు.


