●
తిరుపతి తుడా: ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా మహమ్మారి అనుభవాలను గుర్తుచేస్తోంది. ఈ వైరస్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులపై ఫోకస్ పెట్టాయి. అయితే ఎబోలా వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధిని అరికట్టవచ్చని చెబుతునానరు. వైరస్ ప్రభావం ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బీ.మనోహర్ మీడియాకు తెలిపారు.
అప్రమత్తం
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ తరహాలో వైరస్ ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ఏపీడెమిక్ డిసీజెస్‌తో ఆస్పత్రిలో చేర్పించారు. ఐసోలేషన్‌లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎబోలా వైరస్ సోకిందన్న ప్రచారం వ్యాప్తి చెందడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. వైరస్ కాదని నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఆస్పత్రిలో ఐసోలేషన్ సెంటర్లను సిద్ధం చేశారు. తిరుపతి రుయాలో 15 బెడ్ల సామర్థ్యంతో ఎబోలా ఐసోలేషన్‌ను సిద్ధం చేశారు. అవసరమైన కిట్లు, మందులను సిద్ధంగా ఉంచారు. జనరల్ ఫిజీషియన్, పల్మనాలజీ విభాగాలు సంయుక్తంగా ఐసోలేషన్‌ను పర్యవేక్షించనున్నాయి. రుయా సూపరింటెండెంట్ రెండు వైద్యుల బృందాలను సిద్ధం చేశారు.
కోవిడ్ లక్షణాలే
ఎబోలా వైరస్ లక్షణాలు సైతం కోవిడ్ తరహావే అని రుయా జనరల్ ఫిజీషియన్ విభాగాధిపతి డాక్టర్ తులసీరామ్ తెలిపారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్‌తో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అనంతరం ఐసోలేషన్ వార్డును తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ ఎబోలా వైరస్ సోకితే జ్వరం, ఒళ్లు, కాళ్లు, కీళ్ల నొప్పులు, నీరసం, త్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు వంటి లక్షణాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అనుమానం వచ్చిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అడవి మాంసం, గబ్బిలాలు, ఇతర పక్షులు తిన్న పండ్లను తీసుకోవడం ద్వారా ఈ వైరస్ విస్తరిస్తుందన్నారు. అంటువ్యాధి కనుక ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం వంటివి చేయాలన్నారు.
సిద్ధంగా ఉన్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు రుయా ఆస్పత్రిలో ఎబోలా వైరస్ ఐసోలేషన్‌ను సిద్ధం చేశాం. వైద్యులు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాం. ఈ వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కోవిడ్ తరహా వ్యాధి గనుక ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ మనోహర్,
రుయా సూపరింటెండెంట్


