విద్యార్థి మిత్ర కిట్టు.. కనిపిస్తే ఒట్టు! | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి మిత్ర కిట్టు.. కనిపిస్తే ఒట్టు!

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

యుద్ధాన్ని సాకుగా చూపించి జాప్యం చేసే యత్నంలో కూటమి ప్రభుత్వం

పాఠశాలల పునఃప్రారంభ సమయానికి అందడం గగనమే

అయోమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు

తిరుపతి అర్బన్‌: పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, బ్యాగ్‌లు, మూడు జతల యూనిఫాం, షూ అందించాల్సి ఉంది. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మరో రెండు వారాల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. అయితే ఈ ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు ఇంకా విద్యాశాఖ అధికారులకు అందలేదు. ఇప్పుడల్లా కిట్లు అందే పరిస్థితి లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాన్ని సాకుగా చూపించి విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీలో జాప్యం చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది. జిల్లాలో 1,42,369 మంది విద్యార్థులకు విద్యాసామగ్రి అందించాల్సి ఉంది.

అయోమయం

పాఠశాల ప్రారంభం నాటికి పుస్తకాలు, బ్యాగ్‌, యూనిఫాం ఇవ్వకుంటే ఎలా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యూనిఫాం ముందే అందిస్తే టైలర్లకు ఇచ్చి కుట్టించుకోవడానికి వీలుంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత రెండు, మూడు నెలలకు పుస్తకాలు, బ్యాగ్‌లు, యూనిఫాం ఇస్తే ఏం ప్రయోజనమని పెదవి విరుస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికై నా ఇస్తారో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు.

క్లస్టర్ల బెడద తప్పదా?

ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయందా తగ్గిపోయింది. ఈ క్రమంలో క్లస్టర్ల పేరుతో పాఠశాలలను విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 200కు పైగా పాఠశాలను క్లస్టర్ల పేరుతో విలీనం చేశారు. జిల్లాలో ఇప్పటికీ పది మంది పిల్లలకు లోపు ఉన్న పాఠశాలలు వందకు పైగా ఉన్నట్లు సమాచారం. ఆయా పాఠశాలల పరిధిలోని ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య పెంచడానికి వేసవి సెలవుల్లో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టారు. బడిఈడు పిల్లలు బడిలో ఉండాలని తల్లిదండ్రులను ఒప్పించారు. కానీ పిల్లలకు కావాల్సిన విద్యాసామగ్రి పంపిణీలో జాప్యం చేస్తే వారంతా జారిపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో మళ్లీ క్లస్టర్ల పేరుతో పాఠశాలల విలీనం జరిగితే తమ ఉద్యోగాలు ప్రశ్నార్థకమేనని చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement